ఐసీసీ వరల్డ్‌కప్-2019 ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించేందుకు ఎంచుకున్న నిబంధనపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ విమర్శలు గుప్పించాడు. బౌండరీలతో విజేతను నిర్ణయించడం కన్నా మరో సూపర్ ఓవర్ పెడితే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.
" ప్రపంచకప్ ఫైనల్లో స్కోర్లు సమమైన తర్వాత సూపర్ ఓవర్ రావడం ఇప్పటివరకు జరగలేదు. అప్పడు కూడా టై అవడం కాస్త విచిత్రమే. కానీ.. అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు బౌండరీల ద్వారా కాకుండా మరో సూపర్ ఓవర్ ద్వారా గెలుపును నిర్ణయిస్తే బాగుండేది. ఫుట్‌బాల్‌లో ఇలాంటి నియమమే పాటిస్తారు. ఇరుజట్లకూ మరింత సమయం ఇచ్చి విజేతను నిర్ణయిస్తారు ".
-- సచిన్ తెందూల్కర్, భారత లెజండరీ క్రికెటర్
ఈ బౌండరీ నిబంధనను ఐసీసీ మార్చాలని.. భారత స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, ఆస్ట్రేలియా మాజీ బౌలర్ షేన్ వార్న్ సూచించారు.
లార్డ్స్‌లో జులై 14న జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ 26 బౌండరీలు సాధించగా.. న్యూజిలాండ్ 17 మాత్రమే చేసింది. ఫలితంగా కివీస్ జట్టు ఓటమి పాలవగా.. ఇంగ్లీష్ జట్టు ట్రోఫీని ముద్దాడింది.