కరోనా నేపథ్యంలో చాలా కాలం తర్వాత భారత మాజీ క్రికెటర్లు కలుసుకోవడానికి రోడ్ సేప్టీ వరల్డ్ టీ20 సిరీస్ వేదికైంది. గతేడాది ప్రారంభమైన ఈ సిరీస్ కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే తాజాగా ఈ నెల 5 నుంచి గతేడాది ఎక్కడైతే ఆగిపోయిందో మళ్లీ అక్కడి నుంచే సిరీస్ పున:ప్రారంభం అయింది. ప్రస్తుతం రాయ్‌పూర్‌లో ఉన్న ఇండియా లెజెండ్స్ జట్టు.. ఉల్లాసంగా గడుపుతోంది. ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్ల మధ్య కేక్ ఫైట్ జరిగింది. సరదాగా సాగిన ఈ కేక్ ఫైట్‌కు సంబంధించిన వీడియోను భారత మాజీ క్రికెటర్ రోహన్ గావస్కర్ మంగళవారం ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాను జట్టు సభ్యులు పట్టుకోగా..యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యుసుఫ్ పఠాన్‌లు ఓజా ముఖంపై కేక్ పూశారు. వెంటనే కేక్ పూయడానికి ఓజా ప్రయత్నించగా ఇర్ఫాన్ పఠాన్ పరుగెత్తుకుని తప్పించుకున్నాడు. ఇంతలో ప్రజ్ఞాన్ ఓజా.. యువరాజ్‌కు కేక్ పూయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో మహ్మద్ కైఫ్ యూవీని పట్టుకోగా ఓజా అతని ముఖంపై కేక్ పూసి ప్రతీకారం తీర్చుకున్నాడు.