తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమిండియా చతుర్ముఖ వ్యూహమిదే...

ఐదుగురు బ్యాట్స్​మెన్లు​, ఐదుగురు బౌలర్లు, ఇద్దరు కీపర్లు, ముగ్గురు ఆల్​రౌండర్లతో 15 మందితో కూడిన భారత క్రికెట్​ జట్టును నేడు ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. ఇందులో ముగ్గురు ఓపెనర్లు, ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పెషలిస్ట్​ స్పిన్నర్లున్నారు.

ప్రపంచకప్ జట్టు

By

Published : Apr 15, 2019, 6:36 PM IST

ప్రపంచకప్​లో ఆడే 15 మందితో కూడిన భారత జట్టును నేడు ప్రకటించింది బీసీసీఐ. మరి విభాగాల వారిగా మన బలమెంతో ఇప్పుడు చూద్దాం!

ముగ్గురు ఓపెనర్లు...

ప్రపంచకప్​లో భారత జట్టు ముగ్గురు ఓపెనర్లతో బరిలో దిగుతుంది. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ రెగ్యులర్​ ఓపెనర్లుగా తుది జట్టులో స్థానం దాదాపు పదిలమే. కేఎల్ రాహుల్​ రిజర్వ్​ ఓపెనర్​గా ఉన్నాడు.

ఇప్పటికే విజయవంతమైన జోడీగా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్, ధావన్​లకు వన్డేల్లో మంచి రికార్డుంది. 101 ఇన్నింగ్స్​ల్లో 4541 పరుగులు జోడించారు. సగటు 45 కావడం విశేషం. ఇందులో 15 శతక భాగస్వామ్యాలున్నాయి. మరోవైపు కేఎల్ రాహుల్​ ఓపెనర్​గానే కాకుండా మిడిల్​ ఆర్డర్​లోనూ ఉపయోగపడతాడు.

మిడిలార్డర్​...

మిడిలార్డర్​లో భారత జట్టుకు వెన్నెముక సారథి విరాట్​ కోహ్లీ. ఛేజింగ్​లో కింగ్​ మూడో స్థానంలో అత్యుత్తమ ఆటగాడిగా ఉన్నాడు. టెస్టులు, వన్డేల్లో ప్రస్తుతం ప్రపంచంలోనే నెంబర్​వన్​ క్రికెటర్​గా ఉన్న కోహ్లీపైనే భారత క్రికెట్​ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

ప్రపంచకప్​కు ముందు నాలుగో స్థానం కోసం... ఎన్నో మార్పులు చేసింది సెలక్షన్​ కమిటీ. ఎంతో మందిని ప్రయత్నించి చివరకు దినేశ్​ కార్తీక్​ను ఎంపిక చేసింది. అయితే.. భారత మాజీ సారథి, అనుభవజ్ఞుడు, వికెట్​కీపర్​ ధోని నాలుగో స్థానంలో వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేం. అదే జరిగితే.. 5, 6 స్థానాల్లో కార్తీక్​, కేదార్​ జాదవ్​, ఆల్​రౌండర్​ విజయ్​శంకర్​ల​ మధ్య పోటీ పెరుగుతుంది.

ఆల్​రౌండర్లతో అదరహో...

ప్రధానంగా మిడిల్​ ఆర్డర్​పై దృష్టిపెట్టిన సెలెక్షన్ కమిటీ... జట్టులో ఆల్​రౌండర్లను ఎక్కువ మందిని తీసుకుంది. ప్రధాన ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య. జట్టు స్థితిని ఒక్కసారిగా మార్చేయగల సత్తా ఈ దూకుడైన ఆటగాడి సొంతం. విజయ్​శంకర్​, రవీంద్ర జడేజాలు ఇటీవలి చక్కటి ప్రదర్శనలు చేస్తున్నారు. కేదార్​ జాదవ్​ బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నాడు. మరో ఆల్​రౌండర్​గా ఇతనికి తుది జట్టులో చోటు దక్కొచ్చు.

ఇద్దరు స్పెషలిస్ట్​ స్పిన్నర్లు..ముగ్గురు పేసర్లు...

ఐదారేళ్ల కింద భారత జట్టులో ప్రధాన స్పిన్నర్లు... అశ్విన్​, జడేజా. అయితే... ఇటీవలి కాలంలో అద్భుత ప్రదర్శన చేస్తూ వారికి ప్రత్యమ్నాయంగా ఎదిగారు చాహల్​, కుల్​దీప్​ యాదవ్​లు. వీరిద్దరూ మెగాటోర్నీకి ఎంపికయ్యారు.

గత ఏడాది కాలంగా విదేశాల్లోనూ వీరు మంచి ప్రదర్శనలు చేస్తున్నారు. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్​లలో జట్టు విజయాల్లో వీరి పాత్ర కీలకం. వీరితో పాటు అనుభవజ్ఞుడైన జడేజా కూడా జట్టులో ఉన్నాడు. కేదార్ జాదవ్ పార్ట్ టైమ్ స్పిన్నర్​గా ఆకట్టుకుంటున్నాడు. ఈ నలుగురితో భారత స్పిన్ విభాగం పటిష్ఠంగా ఉంది.

జస్​ప్రీత్​ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, షమీలతో భారత పేస్ విభాగం బలంగా ఉంది. గత కొంత కాలంగా బుమ్రా , భువీ నిలకడగా రాణిస్తూ జట్టుకు విజయాలందిస్తున్నారు. ఇంగ్లండ్​లోని ఫాస్ట్​ పిచ్​లపై పేసర్లే కీలకం. అయితే.. ముగ్గురు సీమర్లే ఉండటం భారత్​కు కొంత బలహీనత. వీరిలో ఎవరైనా గాయాల బారినపడితే జట్టుకు ప్రతికూలంగా మారే అవకాశముంది.

ఇలా పక్కా వ్యూహంతో ప్రపంచకప్​కు జట్టును ఎంపిక చేసింది సెలక్షన్​ కమిటీ. ఇంగ్లండ్​ అండ్​ వేల్స్​ సంయుక్తంగా నిర్వహించే 2019 ప్రపంచకప్​ మే 30న ఆరంభం కానుంది. జులై 14న ఫైనల్​.

మే 30న ఇంగ్లండ్​, సౌతాఫ్రికాల మధ్య జరిగే తొలి మ్యాచ్​తో ప్రపంచ క్రికెట్​ సంగ్రామానికి తెరలేవనుంది. జూన్​ 5న దక్షిణాఫ్రికా మ్యాచ్​తో టీమిండియా.. ప్రపంచకప్​లో తొలి పరీక్ష ఎదుర్కోనుంది.

ABOUT THE AUTHOR

...view details