బంగ్లాదేశ్ ఒకప్పుడు పసికూన.. ఇటీవల బలమైన జట్లకు షాక్ ఇస్తూ మంచి టీమ్‌గా ఎదిగింది. 2015 ప్రపంచకప్ తర్వాత నాలుగేళ్లలో చాలా మారిందీ జట్టు. ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ వరకు చేరింది. అనంతరం జరిగిన ఆసియా కప్‌లో ఫైనల్‌కు వెళ్లి చివరి బంతి వరకు పోరాడి ఓటమిపాలైంది. ఈ వరల్డ్‌కప్‌లో బంగ్లాను చిన్నజట్టే అని అంచనా వేస్తే మాత్రం ప్రత్యర్థికి పరాభవం తప్పదు.
1999లో బంగ్లాదేశ్ తొలి ప్రపంచకప్ ఆడింది. 2015లో ఇంగ్లాండ్‌పై విజయంతో క్వార్టర్ ఫైనల్ చేరడం మినహా ప్రతీసారి గ్రూప్ దశకే పరిమితమైంది. 2007లో భారత్‌పై సాధించిన సంచలన విజయంతో సూపర్-8కు అర్హత సాధించింది. ఈసారి మెరుగైన ర్యాంకింగ్‌తో వెస్టిండీస్‌ను వెనక్కి తోసి నేరుగా టోర్నీకి అర్హత సాధించింది. మొత్తంగా 33 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్ 11 గెలిచి.. 20 ఓడింది. రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి.
బలాలు
అనుభవజ్ఞులైన, అత్యుత్తమ ఆటగాళ్లతో ఈసారి బరిలోకి దిగుతోంది బంగ్లాదేశ్ జట్టు. గతంలో జరిగిన ఏ ప్రపంచకప్ టోర్నీలోనూ ఆ జట్టు ఇంత సమతూకంతో లేదు. దాదాపు ఇదే ఆటగాళ్లతో కూడిన జట్టు ఇంగ్లాండ్‌లో 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్‌కు చేరింది. వారిపైనే నమ్మకముంచి.. అదే జట్టును కొనసాగించి ఇటీవల మంచి ఫలితాలను సాధించింది బంగ్లాదేశ్. సారథి మొర్తజా, తమీమ్ ఇక్బాల్, షకీబుల్ హసన్, ముష్ఫికర్ రహీం, మహ్ముదుల్లా లాంటి అనుభవజ్ఞులు ఆ జట్టు సొంతం. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన షకీబ్ జట్టుకు కీలకం కానున్నాడు. ఈ ప్రపంచ కప్ తర్వాత ఆటకు వీడ్కోలు చెప్పనున్న మొర్తజా టోర్నీని చిరస్మరణీయం చేసుకోవాలని భావిస్తున్నాడు. యువ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ బంగ్లా జట్టుకు అతి పెద్ద బలం. ఇంగ్లాండ్ పిచ్‌లపై అతని స్వింగ్, పేస్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలడు.