తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రూట్'ను తప్పించడం ఎందుకింత కష్టం! - england

కోహ్లీ, పుజారా, స్మిత్‌, కేన్‌కు లేని నైపుణ్యం ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌ సొంతం. శ్రీలంక పర్యటన సహ ప్రస్తుత భారత్​తో సిరీస్​లో అతడు భీకరమైన ఫామ్​లో ఉన్నాడు. శతకాలతో మోత మోగిస్తున్నాడు. అసలు అతడిని కట్టడి చేయడంలో బౌలర్లు ఎందుకు విఫలమవుతారో ఓ సారి చూద్దాం.

why getting root out is difficult for bowlers
'రూట్'ను తప్పించడం ఎందుకింత కష్టం!

By

Published : Feb 6, 2021, 7:19 PM IST

అనుకున్నదే జరిగింది..! విధ్వంసకర ఫామ్‌లో ఉన్న జోరూట్‌ ద్విశతకం బాదేశాడు. తన కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఇంగ్లాండ్‌ను పటిష్ఠ స్థితిలో నిలిపాడు. టీమ్‌ఇండియాకు కొరకరాని కొయ్యగా మారిపోయాడు. ఆసియా గడ్డపై తనను మించిన విదేశీ ఆటగాడు మరొకరు లేరని చాటాడు. చెపాక్‌లో అతడిని ఔట్‌ చేయడానికి కోహ్లీసేన ఎన్ని కష్టాలు పడిందో..? ఎంతగా శ్రమించిందో..? మరి ఇంగ్లాండ్‌ సారథిని పెవిలియన్‌ 'రూట్‌' పట్టించడం ఎందుకంత కష్టమో తెలుసా?

జో రూట్

తిరుగులేని ఫామ్‌

రూట్

ఈ ఏడాది ఆరంభం నుంచి అత్యుత్తమ ఫామ్‌లో కనిపిస్తున్నాడు జో రూట్‌. భారత్‌లో అడుగుపెట్టడానికి ముందే ప్రమాద ఘంటికలు మోగించాడు. శ్రీలంకలో వరుసగా రెండు శతకాలు బాదేశాడు. ఎంతటి ఆటగాడికైనా లంకలో లంకేయులపై ఆడటం అంత సులువు కాదు. అలాంటిది గాలె వేదికగా జరిగిన రెండు టెస్టుల్లో 228, 186 పరుగులు సాధించాడు. మొత్తంగా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 106.50 సగటు, 65.63 స్ట్రైక్‌రేట్‌తో 426 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో 25% పరుగులు స్వీప్‌షాట్‌తోనే సాధించాడు. ఇక చెపాక్‌ టెస్టు అతడి కెరీర్‌లో వందో మ్యాచు. సాధారణంగా ఇలాంటి మ్యాచుల్లో ఒత్తిడి ఉంటుంది. రూట్ ‌మాత్రం అలాంటేదేమీ లేకుండా ద్విశతకం (218; 377 బంతుల్లో 19×4, 2×6) బాదేశాడు. 98, 99, 100వ మ్యాచుల్లో శతకాలు చేసిన ఏకైక క్రికెటర్‌గా ఆవిర్భవించాడు.

ఇంగ్లాండ్ సారధి రూట్

కుదురుకున్నాడో..

ఇంగ్లాండ్‌ రెండో వికెట్‌ పడ్డప్పుడు క్రీజులోకి వచ్చిన జోరూట్‌ దాదాపుగా 9 గంటలు క్రీజులో నిలిచాడు. మొదట్లో ఆచితూచి ఆడుతూ క్రీజులో కుదురుకున్నాడు. నిలిచాడంటే భారీ పరుగులు చేయడం అతడి బలం. ప్రతి మ్యాచులోనూ అతడిదే వ్యూహం అనుసరిస్తాడు. చెపాక్‌లోనూ పిచ్‌ పరిస్థితి, ప్రత్యర్థి బౌలర్ల మానసిక స్థితి చదివేసిన రూట్‌ ఆ తర్వాత రెచ్చిపోయాడు. బుమ్రా, ఇషాంత్‌, నదీమ్‌, అశ్విన్‌ సహనాన్ని పరీక్షించాడు. ఎలాంటి బంతులు వేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో యాష్‌, కోహ్లీ మైదానంలో పదేపదే చర్చించారు. ఏ లెంగ్తులో బంతులు వేయాలో ఆలోచించారు. ఎన్ని ప్రణాళికలు అమలు చేసినా చేయాలనుకున్న పనిని రూట్‌ చేసేశాడు. సిబ్లీతో రెండో వికెట్‌కు 200 (390 బంతుల్లో), బెన్‌స్టోక్స్‌తో మూడో వికెట్‌కు 124 (221 బంతుల్లో), ఒలివ్‌ పోప్‌తో నాలుగో వికెట్‌కు 86 (160 బంతుల్లో) పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పాడు. సిక్సర్‌తో ద్విశతకం చేసిన ఇంగ్లాండ్‌ ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. చివరికి నదీమ్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.

డేంజర్‌ జోన్‌లో ఆడడు

రూట్

సాధారణంగా విదేశీ బ్యాట్స్‌మెన్‌ ఉపఖండం పిచ్‌లపై స్పిన్‌ ఎదుర్కొనేందుకు తడబడతారు. రూట్‌ మాత్రం అలాకాదు. స్పిన్‌ బౌలింగ్‌లో అతడి సగటు 65.84. పుజారా (75.92), లబుషేన్‌(71.70), కోహ్లీ (70.47) మాత్రమే అతడి కన్నా ముందున్నారు. వీరు అద్భుతంగా రాణించేందుకు కారణం ప్రమాదకర ప్రాంతంలో ఆడకపోవడమే. బంతి పిచై బ్యాటును చేరే మధ్య దూరాన్ని ఇంటర్‌సెప్షన్‌ అంటారు. ఇదే ప్రమాదకర ప్రాంతం అన్నమాట. దీన్ని తప్పించుకొనేందుకు బ్యాటర్లు మరీ ముందుకొచ్చి లేదా వెనక్కి వెళ్లి ఆడతారు. బౌలర్‌ లెంగ్త్‌ను చెడగొట్టడం మరో పద్ధతి. ముందుకొచ్చి ఆడితే బంతి పూర్తిగా టర్న్‌ అవ్వకముందే బాదొచ్చు. వెనక్కి వచ్చి ఆడితే పూర్తి టర్న్‌ చూసి షాట్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అంటే బంతి పిచైన 2 మీటర్లలోపు, పిచైన 3 మీటర్ల తర్వాత ఆడితే ఔటయ్యే అవకాశాలు తక్కువ. పిచైన 2-3 మీటర్ల మధ్య ఆడితే ఔటయ్యే ప్రమాదం ఎక్కువ. రూట్‌ ప్రతిభ అంతా ఇక్కడే ఉంది. ప్రమాదకర జోన్‌ తప్పించుకోవడంలో అతడిని మించిన వారు లేరు. ఇప్పటి వరకు కేవలం 11.7% షాట్లే ఈ జోన్‌లో ఆడాడు. అంటే కోహ్లీ (12%), విలియమ్సన్‌ (13%), వార్నర్‌ (16%), స్మిత్(16%) కన్నా మెరుగన్నమాట.

లెంగ్త్‌ అంచనాలో మేటి

జో రూట్

బంతి లెంగ్త్‌ను అంచనా వేయడం, తన ఫుట్‌వర్క్‌పై రూట్‌కు అపారమైన విశ్వాసం. అదే అతడి బలం. ఒకవేళ బంతి ఎక్కడ పిచైందో తెలియకపోతే బ్యాక్‌ఫుట్‌, ఆఫ్ ద పిచ్‌ ఆడతాడు. బంతి ఎక్కడ పిచైందో సరిగ్గా అంచనా వేస్తే అడుగు ముందుకేసి స్పిన్‌ అవ్వకముందే బంతిని ఆడేస్తాడు. అందుకే ఆసియాలో అతడు పరుగుల వరద పారిస్తున్నాడని విశ్లేషకులు అంటున్నారు. సాధారణంగా రూట్‌ ముందుకొచ్చి ఆడినప్పుడు బంతులు ప్రమాదకర ప్రాంతంలోకి వెళ్లే అవకాశాలు కేవలం 48 శాతమే. పుజారా (51%), స్మిత్‌ (56%), రహానె (60%), కోహ్లీ (61%) అతడి తర్వాతే ఉన్నారు. శ్రీలంకలో చాలా వరకు బంతి పిచైన 1.03 మీటర్ల లోపే రూట్‌ ఆడేశాడు. అందుకే వరుస శతకాలు చేయగలిగాడు. చెపాక్‌లోనూ అతడిదే పని చేశాడు. అయితే అతడిని అడ్డుకొనేందుకు బౌలర్లు బంతిని షార్ట్‌ లెంగ్త్‌లో వేస్తే చక్కగా క్రీజులో నిలబడి ఆడేస్తున్నాడు. సరే అని ఫుల్‌ లెగ్త్‌లో వేస్తే కూర్చొని స్వీప్‌ చేస్తున్నాడు. అదీ స్క్వేర్‌లో ఫీల్డర్ల మధ్య చేస్తుండటం వల్ల బౌండరీలు సునాయాసంగా రాబడుతున్నాడు. అతడి దేహం, మానసిక స్థితి సైతం స్పిన్‌ ఆడేందుకు అనువుగా ఉన్నాయి. అందుకే అతడిని ఆపడం.. ఔట్‌ చేయడం అతి కష్టం. రూట్‌ అర్ధశతకాలను శతకాలుగా మలిచే అవకాశం తక్కువ. శతకాలను ద్విశతకాలు, భారీ స్కోర్లుగా మలవడంలో మాత్రం దిట్ట. అందుకే 30 పరుగుల్లోపే అతడిని టీమ్‌ఇండియా కట్టడి చేయక తప్పదు.

రూట్

ఇదీ చూడండి:చరిత్ర సృష్టించిన రూట్- 100వ మ్యాచ్​లో 200

ABOUT THE AUTHOR

...view details