భారత్‌తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ అద్భుత విజయం సాధించింది. 348 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కివీస్ సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్‌టేలర్ (109) అజేయ శతకంతో చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొని, తమ జట్టును విజేతగా నిలిపిన అతడిపై ప్రశంసల కురుస్తూనే ఉన్నాయి. ఈ జాబితాలోకి భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ చేరాడు. ట్విట్టర్ వేదికగా టేలర్‌ను ఓ ప్రశ్న అడిగాడు.
'ఆహా.. ఏం ఆట! అద్భుతం రాస్‌టేలర్. కానీ శతకం చేసిన ప్రతిపారీ నువ్వు నాలుక ఎందుకు బయటకు చాపుతావో చెప్పవా??? చక్కని క్రికెట్ ఆడావు' -హర్భజన్ సింగ్ ట్వీట్
అర్ధశతకం లేదా శతకమో బాదినప్పుడు ఒక్కో క్రికెటర్ ఒక్కోలా సంబరాలు చేసుకుంటాడు. ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గాల్లోకి ఎగిరి సంబరాలు చేసుకుంటాడు. రాహుల్ బ్యాటును సగం పట్టుకొని వందనం చేస్తాడు. క్రిస్‌గేల్ సహా విండీస్ క్రికెటర్లు ఏ ఒక్కసారీ ఒకేలా సంబరాలు చేసుకోరు. విరాట్ కోహ్లీ ఆ మధ్య తన మెడలోని గొలుసును ముద్దాడేవాడు. టేలర్ మాత్రం విచిత్రంగా నాలుక బయటకు చాపుతాడు. అయితే తన కూతురు మెకెన్జీ కోసమే ఇలా చేస్తున్నాడని తెలిసింది.
నాలుక బయటపెట్టి సెలబ్రేషన్ చేసుకుంటున్న రాస్ టేలర్
'నేను శతకాలు చేసినప్పటికీ కొన్నిసార్లు జట్టులోంచి తప్పించేవారు. ఆస్ట్రేలియాపై నా రెండో శతకం చేసిన తర్వాత నన్ను తప్పించారు. అప్పుడు నేను నా నాలుకను బయటపెట్టా. అలా చేసినప్పుడు నా కూతురు సంతోషంతో కేరింతలు పెట్టేది. ఆ తర్వాత ఆమె కోసం అలా చేసేవాడిని' అని 2015లో టేలర్ చెప్పినట్టు సమాచారం.