టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ.. కుటుంబంతో, తన సహచర ఆటగాళ్లతో చాలా సరదాగా ఉంటాడు. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మహీకి సంబంధించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
గతంలో మాల్దీవులకు వెళ్లిన ధోనీ, సహచర క్రికెటర్లకు పానీపూరి అందిస్తూ ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియోలో మహీ బండి వద్ద నిలబడి పానీపూరి తీసుకుని, కావాల్సిన మోతాదులో బఠాణీ, ఉల్లిపాయ తరుగు పెట్టాడు. చెంచాతో పానీని అందులో పోసి సీనియర్ స్పిన్నర్ పియూష్ చావ్లా, మాజీ పేసర్ ఆర్పీసింగ్కు అందించాడు. వెంటనే ఆర్పీసింగ్ తలను ఆడించి ధోనీకి ధన్యవాదాలు తెలిపాడు. 'బహుముఖ ప్రజ్ఞాశాలి ధోనీ , మహీకి ఎన్నో పనులు వచ్చు', 'ఈ ప్రపంచంలో నాకు పానీపూరీ, మహీ అత్యంత ఇష్టం', అంటూ నెటిజన్లు మహీపై అభిమానాన్ని చాటుతూ ఆ వీడియో దిగువన కామెంట్లు పెట్టారు.