టీ 20 సిరీస్ చేజిక్కించుకుంది.. వన్డే సిరీస్‌నూ వదల్లేదు.. అదే జోరులో టెస్టు సిరీస్‌ను కైవసం చేసేందుకు సమయాత్తమవుతోంది టీమిండియా. కరీబియన్లకు విజయం రుచి చూపించకుండానే వెస్టిండీస్ పర్యటన ముగిద్దామనుకుంటోంది. మరోవైపు విండీస్ మిగిలిన ఒక్క టెస్టులోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలనుకుంటోంది. కింగ్స్టన్ వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు నేడు జరగనుంది.
పంత్ పైనే అందరి చూపు..
విండీస్‌తో జరిగిన 3 టీ-20లు మినహా మిగతా మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు టీమిండియా కీపర్ రిషభ్ పంత్. 0, 4, 65*, 20, 0, 7 విండీస్ పర్యటనలో పంత్ గణాంకాలివి. కీలక సమయాల్లో ఒత్తిడికి లోనవుతూ వికెట్‌ను సమర్పించుకుంటున్నాడీ యువ బ్యాట్స్‌మన్.
ఇప్పటికే మరో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా, ఆంధ్ర క్రికెటర్ కోన్ భరత్ తమ అవకాశాలు కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తుది జట్టులో పంత్ ఉంటాడా లేదా సాహా, భరత్.. ఇద్దరిలో ఒకరిని తీసుకుంటారా అనేది చూడాలి.
మయాంక్ ఉంటాడా..
తొలి టెస్టులో రోహిత్‌ను కాదని మయాంక్ అగర్వాల్‌కు అవకాశం కల్పించారు. అయితే ఆ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. మయాంక్‌కు మరో అవకాశమిచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తుది జట్టులో రోహిత్‌ను తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
సత్తాచాటిన బౌలర్లు..
బౌలింగ్ విషయానికొస్తే మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇషాంత్ ప్రత్యర్థిని దెబ్బతీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు. మొత్తంగా ఆ టెస్టులో వీరిద్దరూ(8+6) వికెట్లు తీశారు. మరోసారి వీరు విజృంభిస్తే విండీస్‌కు పరాభవం తప్పదు.