ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు తొలిరోజు సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేశామని టీమ్ఇండియా వైస్‌కెప్టెన్ అజింక్య రహానె అన్నాడు. భారత్ టాస్ గెలవడం కీలకంగా మారిందని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాలని వెల్లడించాడు. హిట్‌మ్యాన్‌తో పుజారా, తాను నెలకొల్పిన భాగస్వామ్యాలు మేలు చేస్తాయని తెలిపాడు. శనివారం ఆట ముగిశాక జింక్స్ మీడియాతో మాట్లాడాడు.
'తొలిరోజు నుంచే బంతి టర్న్ అవుతుందని మాకు తెలుసు. అందుకే టాస్ గెలవడం మేలు చేసింది. రోహిత్‌తో పుజారా, నేను చేసిన భాగస్వామ్యాలు కీలకంగా మారతాయి. ఈ వికెట్‌పై సానుకూలంగా బ్యాటింగ్ చేయాలని రోహిత్ నాతో చెప్పాడు. తొలి టెస్టుతో సంబంధం లేకుండా సానుకూలంగా ఉండాలని అనుకున్నా. మంచి ఫుట్‌వర్క్‌తో ఆడితే ఈ పిచ్‌పై పరుగులు వస్తాయి. స్వీప్ చేయడంపై మాకో వ్యూహం ఉంది. మాకు బలమైన ప్రాంతాల్లో బంతులు వేసేలా ప్రణాళికలు రచించాం. అవి ఫలించాయి' అని అజింక్య అన్నాడు.
'మ్యాచులో తొలి 20-30 బంతులు అత్యంత కీలకమని భావించాం. అందుకే సానుకూలంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. మరో 50-60 పరుగులు చేస్తే బాగుంటుంది. రిషభ్ ఇంకా క్రీజులోనే ఉన్నాడు. ఒకటి లేదా మరో రెండు భాగస్వామ్యాలు నెలకొల్పితే మేం మెరుగైన స్థితిలో ఉంటాం. ఇంగ్లాండ్ బౌలర్లు వేగంగా బంతులు వేసినప్పుడు ఆడటం కష్టంగా అనిపించింది. వేగంలో వైవిధ్యం కనిపించింది' అని వెల్లడించాడు రహానె.
రహానే నిరూపించుకున్నాడు: రోహిత్
రెండో టెస్ట్ తొలిరోజు ఆట అనంతరం.. అజింక్య రహానే ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు సెంచరీ హీరో రోహిత్ శర్మ. రహానె ఎల్లప్పుడూ క్లిష్ట సమయాల్లో జట్టును ఆదుకునే ఇన్నింగ్స్ ఆడి బ్యాట్స్‌మన్‌గా తనను తాను నిరూపించుకుంటున్నాడన్నాడు. ఈ మ్యాచ్‌లో అజింక్యతో కలిసి నాలుగో వికెట్‌కు 162 పరుగులు జోడించాడు రోహిత్.