'అల వైకుంఠపురములో' సినిమాలోని 'బుట్టబొమ్మ' పాటతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్. ఈ పాట అంటే తనకెంతో అమితమైన ఇష్టమని పలు సందర్భాల్లో డ్యాన్స్ కూడా వేశాడు. తాజాగా శుక్రవారం జరిగిన భారత్-ఆస్ట్రేలియా తొలి వన్డే మ్యాచ్‌లోనూ ఈ పాటకు సంబంధించిన స్టెప్పులు వేసి అభిమానులను అలరించాడు.
ఈ మ్యాచ్ వేదికైన సిడ్నీ స్టేడియానికి 50శాతం మంది ప్రేక్షకులను అనుమతించారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అభిమానులు డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి 'వన్స్‌మోర్ వార్నర్.. బుట్టబొమ్మ' అంటూ కేకలు వేశారు. స్పందించిన వార్నర్ బుట్టబొమ్మ స్టెప్పులు వేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
లాక్‌డౌన్‌లో క్రికెట్ కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల క్రికెటర్లందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఆ సమయంలో టిక్‌టాక్ వీడియోలు చేస్తూ వార్నర్ కుటుంబం అభిమానులకు దగ్గరైంది. ఈ క్రమంలోనే 'బుట్టబొమ్మ', 'మైండ్‌బ్లాక్' లాంటి తెలుగు పాటలకు డ్యాన్స్ చేసి టాలీవుడ్ ఫ్యాన్స్‌కు చేరువయ్యాడు వార్నర్.