తెలంగాణ

telangana

ETV Bharat / sports

'తొలి టెస్టు తర్వాతే ధోనీ రిటైర్మెంట్ షాక్' - VVS Laxman news

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్​కు వీడ్కోలు ప్రకటించాక అందరూ అతడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ధోనీ గురించి రెండు ఆసక్తికర విషయలు వెల్లడించాడు.

'తొలి టెస్టు తర్వాతే ధోనీ రిటైర్మెంట్ షాక్'
'తొలి టెస్టు తర్వాతే ధోనీ రిటైర్మెంట్ షాక్'

By

Published : Aug 17, 2020, 4:41 PM IST

కెప్టెన్‌ కూల్‌గా పేరుతెచ్చుకున్న మహేంద్రసింగ్‌ ధోనీ అంతే కూల్‌గా రిటైర్మెంట్‌ ప్రకటించి క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ అతడు టీమ్‌ఇండియాకు చేసిన సేవల్ని, సాధించిన విజయాల గురించి మాట్లాడుతున్నారు. అయితే, తాను ఆడే రోజుల్లో మహీలోని మరో కోణాన్ని చూశానని చెప్పాడు హైదరాబాద్‌ సొగసరి బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌. ధోనీ చేసిన ఆ రెండు విశేషాలు తానెప్పటికీ మర్చిపోలేనని గుర్తుచేసుకున్నాడు. మహీ 2006లో పాకిస్థాన్‌పై తొలి టెస్టు సెంచరీ చేసినప్పుడు తన రిటైర్మెంట్‌పై ఓ కీలక వ్యాఖ్య చేశాడని, దాంతో అందరినీ నివ్వెరపరిచాడని లక్ష్మణ్‌ పేర్కొన్నాడు.

"పాక్‌ పర్యటన సందర్భంగా ఫైసలాబాద్‌లో జరిగిన రెండో టెస్టులో మహీ ఈ ఫార్మాట్‌లో తొలి శతకం బాదాడు. తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌కి వచ్చి గట్టిగా ఇలా అరిచాడు. 'నేనిప్పుడు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నా. ఎంఎస్‌ ధోనీ అనే నేను టెస్టుల్లో శతకం బాదాను. టెస్టు క్రికెట్‌లో ఇంతకుమించి నాకేం వద్దు' అని చెప్పాడు. మేమంతా ఒక్కసారిగా అలా చూస్తుండిపోయాం" అని వీవీఎస్‌ వివరించాడు.

అలాగే మరోసారి టీమ్‌ఇండియా సారథిగా ఉన్నప్పుడూ జట్టు మొత్తాన్ని ధోనీ అయోమయానికి గురిచేశాడని చెప్పాడు లక్ష్మణ్. 2008లో నాగ్‌పుర్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడేటప్పుడు ఒక రోజు మైదానం నుంచి హోటల్‌ వరకు బస్సును నడిపాడని చెప్పాడు. డ్రైవర్‌ను వెనక్కి వెళ్లమని చెప్పి అందరినీ తీసుకొని హోటల్‌ వరకు తీసుకెళ్లాడని వివరించాడు. ధోనీ అంటే అంతగా కలిసిపోతాడని, బయట జీవితాన్ని సరదాగా గడుపుతాడని పేర్కొన్నాడు.

ABOUT THE AUTHOR

...view details