న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా పరాజయం చెందింది. సమష్టిగా విఫలమైన జట్టు టెస్టు ఛాంపియన్ షిప్లో మొదటి ఓటమిని చవిచూసింది. సారథి విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో విఫలమయ్యాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ తన బ్యాటింగ్ బాగానే ఉందని చెప్పాడు.
"ఈ పర్యటనలో నేను బాగానే ఆడుతున్నా. కొన్నిసార్లు మంచి స్కోర్లు చేయనంత మాత్రాన బ్యాటింగ్ విధానం మారినట్లు కాదు. దీర్ఘ కాలంగా తీరిక లేకుండా ఆడటం వల్ల ఒక్కోసారి రాణించలేం. ఒక్క ఇన్నింగ్స్ బాగా ఆడితే బయట మాట్లాడుకునే పరిస్థితులు మారిపోతాయి. కానీ నేను అలా ఆలోచించేవాడిని కాదు. బయటివాళ్లు ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తే.. నేను కూడా వారి మధ్యే ఉండేవాడిని. చిన్నచిన్న పొరపాట్లను సరిచేసుకుని ప్రాక్టీస్ సెషన్‌లో మరింత కష్టపడితే సరైన ఫలితాలొస్తాయి. జట్టు విజయం సాధించినప్పుడు 40 పరుగులైనా సరిపోతాయి. అదే ఓటమిపాలైతే.. శతకం బాదినా ఉపయోగం ఉండదు."