టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ 2020ని ఒక్క శతకం లేకుండా పూర్తి చేశాడు. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులే చేసిన అతడు ఈ ఏడాదిని సెంచరీ సాధించకుండా ముగించాడు. దీంతో 2008 తర్వాత తొలిసారి సెంచరీ లేకుండా నిలిచాడు. అతడు అరంగేట్రం చేసిన ఏడాది మినహాయిస్తే కోహ్లీ ఏటా శతకాలతో మైమరపించాడు.
నవంబర్‌లో ఆస్ట్రేలియాతో ఆడిన రెండో వన్డేలో అతడు చేసిన 89 పరుగులే ఈ ఏడాది అత్యధిక స్కోరు కావడం గమనార్హం. మరోవైపు ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ 74 పరుగులు చేసిన అతడు సెంచరీ దిశగా సాగుతుండగా అనూహ్యంగా రహానె తప్పిదానికి రనౌటయ్యాడు.