తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టెస్టుల్లో నాణ్యమైన పేసర్ల కొరత ఉంది'

టెస్టు క్రికెట్లో నాణ్యమైన బౌలర్లు లోపించారని అన్నాడు టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు సచిన్ తెందూల్కర్. టీమిండియా డ్రెస్సింగ్​ రూమ్​ను మిస్సవుతున్నా అంటూ మరికొన్ని విషయాలను పంచుకున్నాడు.

By

Published : Nov 15, 2019, 5:31 AM IST

సచిన్

టెస్టు క్రికెట్లో నాణ్యమైన పేసర్ల కొరత ఏర్పడిందని దిగ్గజ క్రికెట్‌ సచిన్‌ తెందుల్కర్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల మధ్య వైరం కనిపించడం లేదని తెలిపాడు. 1970, 80ల్లో మాదిరిగా సునీల్ గావస్కర్‌ వర్సెస్ ఆండీ రాబర్ట్స్‌, డెన్నిస్‌ లిల్లీ లేదా ఇమ్రాన్‌, సచిన్‌ వర్సెస్ మెక్‌గ్రాత్‌, వసీమ్‌ అక్రమ్‌ల మధ్య పోటాపోటీతత్వం కనిపించడం లేదని అన్నాడు.

"అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైరాలు ఇప్పుడు లేవు. ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం నాణ్యమైన పేసర్లు లేకపోవడమే ఇందుకు కారణం. క్రికెట్‌ ప్రమాణాలు పడిపోవడం టెస్టు క్రికెట్‌కు మంచిది కాదు. ప్రమాణాలు నిర్దిష్టంగా, అత్యున్నతంగా ఉండాలి. అద్భుతమైన పిచ్‌లు లేకపోవడమే ఇందుకు కారణమని నేను చెప్పగలను. పేసర్లు, స్పిన్నర్లకు సహకరించే వికెట్లు రూపొందించినప్పుడు బ్యాటు, బంతి మధ్య సమతూకం తిరిగొస్తుంది. ఈ సారి యాషెస్‌ పిచ్‌లు చాలా బాగున్నాయి. పోటాపోటీగా మ్యాచ్‌లు జరిగాయి."

-సచిన్, టీమిండియా మాజీ క్రికెటర్

బౌలర్లకు ఐపీఎల్​ బాగా ఉపయోగపడుతుందని అన్నాడు సచిన్. కానీ ఈ టోర్నీలో ప్రదర్శన చూసి వన్డేలకు, టెస్టులకు ఎంపిక చేయడం మంచిది కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

"ఐపీఎల్‌లో బాగా ఆడితే టీమిండియా తరఫున టీ20లు ఆడేందుకు కచ్చితంగా అర్హులే. కానీ ఈ టోర్నీలో ప్రదర్శన ఆధారంగా వన్డే, టెస్టులకు మాత్రం ఎంపిక చేయొద్దు. బుమ్రాలా టీ20ల్లో రాణించి, వన్డేల్లో అదరగొడితే టెస్టుల్లో ఎంపిక చేయడంలో తప్పులేదు. 1998 ఆస్ట్రేలియా సిరీస్‌ సచిన్‌×వార్న్‌ పోటీగా ముద్రపడింది. సహజంగా నేను పోలికలు ఇష్టపడను. 1991లో పెర్త్‌లో చేసిన టెస్టు శతకం మాత్రం నా ఫేవరెట్‌. అంతర్జాతీయ క్రికెట్లో అది నా ఆగమనాన్ని చాటింది."

-సచిన్, టీమిండియా మాజీ క్రికెటర్

టీమిండియా డ్రెస్సింగ్​ రూమ్​ను చాలా మిస్సవుతున్నానని తెలిపాడు సచిన్. ఆ వేడుకలు గుర్తుకొస్తున్నాయని అన్నాడు.

"టీమిండియా డ్రెస్సింగ్‌రూమ్‌ను చాలా మిస్సవుతున్నాను. ఐదు తరాల క్రికెటర్లతో ఆడిన ఒకే ఒక్క ఆటగాడిని నేనే కావొచ్చు. ముందు కపిల్‌దేవ్‌, రవిశాస్త్రి, క్రిష్‌ శ్రీకాంత్‌, వెంగ్‌సర్కార్‌, అజారుద్దీన్‌తో ఆడాను. తర్వాత గంగూలీ, ద్రవిడ్‌తో కలిసి ఆడాను. ఆ తర్వాత యువరాజ్‌, హర్భజన్‌, జహీర్‌ ఖాన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, ఆశిష్‌ నెహ్రా తరంతో డ్రెస్సింగ్‌ రూమ్​ పంచుకున్నా. ఆ తర్వాత సురేశ్ రైనా తరం, వెంటనే కోహ్లీ, రోహిత్‌, రహానె తరాన్ని ప్రత్యక్షంగా చూశాను. ఆ నవ్వులు, ఆ తీవ్రత, ఆ వేడుకలు నేను మిస్సవుతున్నా. డ్రెస్సింగ్‌ రూమ్‌ అంటే ఒక దేవాలయం"
-సచిన్, టీమిండియా మాజీ క్రికెటర్

ఇవీ చూడండి.. ధావన్ డకౌట్.. దిల్లీపై జమ్ముకశ్మీర్ రికార్డు విజయం

ABOUT THE AUTHOR

...view details