కివీస్ క్లీన్‌స్వీప్...భారత్‌కు తప్పని ఓటమి న్యూజిలాండ్ పర్యటనలో వన్డే సిరీస్ గెలిచిన భారత మహిళా జట్టు... టీ20 సిరీస్‌లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. కివీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి 0-3తో సిరీస్ చేజార్చుకుంది హర్మన్‌ప్రీత్ సేన.
హామిల్టన్ వేదికగా జరిగిన మూడో టీ-ట్వంటీలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 161 పరుగులు చేసింది. భారత్ జట్టు 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి బంతి దాకా మ్యాచ్ ఉత్కంఠగా సాగింది.
అవకాశాలను వినియోగించుకోలేదు...
సిరీస్‌లోని మూడు టీ20ల్లోనూ గెలుపు అవకాశాలను చేజార్చుకుంది భారత జట్టు. ఓ దశలో గెలిచేలా కనిపించినా కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది.
మూడో టీ-ట్వంటీలోనూ లక్ష్యాన్ని సులువుగా ఛేదిస్తుందనే దశ నుంచి ఓటమి వైపుగా నడిచింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి విజయానికి చేరువలోకి వచ్చి రెండు పరుగుల తేడాతో ఓడింది.
మంధాన పోరాటం వృథా
ఓపెనర్ స్మృతి మంధాన చేసిన పోరాటం వృథా అయింది. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే ధాటిగా ఆడిన మంధాన కివీస్ బౌలర్లపై విరుచుకుపడింది. మరో ఓపెనర్ ప్రియా పూనియా తక్కువ స్కోర్‌కే అవుటైనా మంధాన ఎదురుదాడి కొనసాగించింది. 62 బంతుల్లో 86 పరుగులు చేసి భారత్‌ను విజయం దిశగా నడిపించింది. 16వ ఓవర్లో సోఫియా డెవిన్ మంధానను అవుట్ చేసింది.
చివర్లో ఉత్కంఠ
మంధాన అవుటైన తర్వాత పరుగులు మందగించాయి. బంతులు... చేయాల్సిన పరుగుల మధ్య అంతరం పెరిగిపోయింది. మిథాలీ, దీప్తి శర్మపై ఒత్తిడి పెరిగింది. చివరి ఓవర్లో 17 పరుగులు అవసరమయ్యాయి. కాస్పెర్క్ వేసిన తొలి బంతినే బౌండరీగా మలిచి గెలుపుపై ఆశలు రేపింది మిథాలీ రాజ్. మూడో బంతికి మరో బౌండరీ సాధించిన దీప్తి శర్మ భారత్‌ను లక్ష్యానికి చేరువ చేసింది. చివరి మూడు బంతులకు 7 పరుగులు కావాల్సి ఉండగా నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో ఆగిపోయింది భారత జట్టు.
కివీస్ ఓపెనర్ల జోరు
ఓపెనర్లు సోఫీ డేవిన్, సుజీబేట్స్ కివీస్‌కు శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించారు. బేట్స్‌ను అవుట్ చేసి అరుంధతి రెడ్డి వీరి జోడిని విడదీసింది. మరో ఓపెనర్ సోఫీ డివైన్ దూకుడైన బ్యాటింగ్‌తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. 52 బంతుల్లో 72 పరుగులు చేసి డివైన్ పెవిలియన్‌కు చేరింది. 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది కివీస్.
స్కోర్లు..
కివీస్ ఇన్నింగ్స్: 161/7
సోఫీ డెవిన్ 72 ( 52 బంతుల్లో), సూజీ బేట్స్ 24 (18), హన్నా రోవే 12 (9), ఆమీ సటేర్వేయిట్ 31 (23), కేటీ మార్టిన్ 8 (8), అన్నా పీటర్సన్ 7* (5 ), లేహ్ కాస్పెర్క్ 0 (1), లీ తాహూహూ 5 (4)
భారత్ ఇన్నింగ్స్: 159/4
ప్రియా పూనియా 1 (2 బంతుల్లో), స్మృతి మంధానా 86 (62), రోడ్రిగ్స్ 21 (17), హర్మన్ ప్రీత్ కౌర్ 2 (3), మిథాలి రాజ్ 24* (20 ), దీప్తీ శర్మ 21* (16).