దిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరినా... బంగ్లా-భారత్ మధ్య తొలి టీ20 నిర్వహించింది బీసీసీఐ. అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఆదివారం(నవంబర్ 3) జరిగిన మ్యాచ్‌లో బంగ్లా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇద్దరు బంగ్లా క్రికెటర్లు వాంతులు చేసుకున్నట్లు సమాచారం.
బంగ్లా సీనియర్ ఆటగాళ్లు ముష్ఫికర్ రహీమ్, సౌమ్యా సర్యార్ అస్వస్థతకు గురైనట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి.రెండేళ్ల క్రితం భారతలో పర్యటించిన శ్రీలంక ఆటగాళ్లు కూడా మైదానంలో వాంతులు చేసుకొని ఇబ్బందులు పడటం పెద్ద చర్చనీయాంశమైంది. అప్పడు లంక ఆటగాళ్లు లాహిరు గామేజ్, సురంగ లక్మల్ ఈ అంశంపైఆ జట్టు బోర్డుకు ఫిర్యాదు చేశారు.
ముష్ఫికర్ రహీమ్ బ్యాటింగ్ తీవ్ర కాలుష్యం...
దీపావళి తర్వాత దిల్లీలో వాయి కాలుష్యం పతాక స్థాయికి చేరింది. ఫలితంగా తొలి టీ20 మ్యాచ్ వేదిక మార్చాలని డిమాండ్లు వినిపించాయి. కానీ బీసీసీఐ ససేమేరా అనడం వల్ల.. ఇరు జట్ల క్రికెటర్లు తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్ ఆడారు. ఆట ముందు వరకూ కాలుష్యం, పొగతోస్టేడియం పరిసరాలు సరిగ్గా కనిపించలేదు. మైదాన ప్రాంతంలో భారీ ఎత్తున స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టిన దిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోషియేషన్(డీడీసీఏ), దిల్లీ మున్సిపల్ విభాగం... మ్యాచ్ మొదలయ్యే సమయానికి పరిస్థితిని కొంచెం అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటన తర్వాత భవిష్యత్తులో శీతాకాలంలో జరగనున్న మ్యాచ్‌లకు దిల్లీ వేదికగా ఉండకుండా ప్రణాళికలు రూపొందిస్తామని బీసీసీఐ అధికారులు చెప్పారు.
తొలి టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా... 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. లక్ష్యాన్ని బంగ్లాదేశ్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ముష్ఫికర్ (60*), సౌమ్య సర్కార్(39) పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ... మ్యాచ్ దిగ్విజయంగా నిర్వహించడంలో ఇరుజట్లు సహకరించాయని అభినందనలు తెలిపాడు.