ట్విట్టర్...సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు ప్రస్తుతమున్న అద్భుత వేదిక. అభిమానులు, ప్రజలకు చేరువగా ఉండేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. మరి అలాంటి సామాజిక మాధ్యమం ద్వారా ఎవరెవరు ఎంత ఆదరణ పొందారు అనేది తాజాగా వెల్లడించింది ట్విట్టర్ ఇండియా.
అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడాకారుల ట్విట్టర్ హ్యాండిల్స్‌కు ర్యాంకింగ్స్ ఇచ్చింది. ఇప్పటికే క్రికెట్లో ఎందరో దిగ్గజాల రికార్డులు ఛేదించేందుకు పోటీ పడుతున్న కోహ్లీ.. అభిమానుల మద్దతులోనూ టాప్ లేపాడు. పురుష ఆటగాళ్లలో విరాట్ కింగ్‌గా నిలిచాడు. మహిళల్లో నం.1గా తెలుగుతేజం, స్టార్ షట్లర్ పీవీ సింధు నిలిచింది. అత్యధిక ట్వీట్లు చేయడం, రీట్వీట్ కావడం, మోస్ట్ లైకులు ఇలా పలు అంశాలను బేరీజు వేసి ర్యాంకులను ప్రకటించింది ట్విట్టర్ ఇండియా. మహిళల తొలి పది స్థానాల్లో వివిధ క్రీడలకు సంబంధించిన వారు ఉన్నా... పురుషుల్లో టాప్-10 మాత్రం క్రికెటర్లే కావడం విశేషం.
1.విరాట్ కోహ్లీ...
విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్‌తో తొలిస్థానాన్ని దక్కించుకున్నాడు కోహ్లీ. ప్రస్తుతం ఉన్న అన్ని జట్ల కెప్టెన్లలో ఇతడే ఎక్కువ సమయం అభిమానులకు కేటాయిస్తాడట. ట్విట్టర్లో 32.6 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు విరాట్. ఇతడు అనుష్క శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజున చేసిన పోస్టులు విపరీతంగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. రీట్వీట్లలో మహీపై చేసిన పోస్టు ఈ ఏడాది రికార్డు సృష్టించింది.
ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో 60 శాతం సగటుతో పరుగులు చేశాడు విరాట్. అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఏడాది 2366 రన్స్ సాధించాడు.
2. మహేంద్ర సింగ్ ధోనీ...
టీమిండియా మాజీ సారథి ధోనీ రిటైర్మెంటు ఈ ఏడాది చర్చనీయాంశంగా మారింది. ప్రపంచకప్‌లో భారతజట్టు సెమీస్‌లో ఓడిపోయాక ఇతడు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. వచ్చే ఏడాది ఐపీఎల్లో బరిలోకి దిగుతాడని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది పెద్దగా సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌లో ఉండకపోయినా.. అభిమానులు అతడి పేరును ఎక్కువగా ప్రస్తావించడం వల్ల రెండో స్థానంలో నిలిచాడు.
3. రోహిత్‌శర్మ
ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు రోహిత్‌శర్మ. టెస్టుల్లోనూ ఓపెనర్‌గా అరంగేట్రం చేశాడు. ఐదు టెస్టుల్లో 556 రన్స్ చేశాడు. ఇందులో మూడు శతకాలున్నాయి. అన్ని ఫార్మాట్లలో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్‌లో 648 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. ఇతడికి ఇప్పటికే 15 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
4. సచిన్ తెందూల్కర్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఆటకు వీడ్కోలు పలికి దాదాపు ఆరేళ్లు అవుతోంది. అయితే ఆ తర్వాత నుంచి ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉంటున్నాడు. ప్రస్తుతం 31 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. చాలా మంది క్రికెటర్ల పుట్టినరోజులు, సామాజిక అంశాలపై ఎక్కువగా ట్వీట్లు చేస్తుంటాడు.