సెప్టెంబర్ 19న ఐపీఎల్ 13వ సీజన్ మొదలవనుంది. ఒకవైపు కరోనా కారణంగా ప్రజలందరూ డీలా పడిన సమయంలో పొట్టి క్రికెట్‌తో కాస్తంత ఊరట లభించనుంది. రోహిత్ మెరుపులు, కోహ్లీ అరుపులు, ధోనీ వ్యూహాలతో మైదానాలు సందడిగా మారనున్నాయి. ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన ప్రీమియర్ లీగ్‌లన్నింటిలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌పై ఓ లుక్కేద్దాం.
విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సారథ్యం వహిస్తోన్న కోహ్లీ.. జట్టుకు కప్పు తీసుకురావడంలో మాత్రం విఫలమవుతున్నాడు. బ్యాట్స్‌మన్‌గా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నా ఛాలెంజర్స్‌ను విజయతీరాలకు చేర్చలేకపోతున్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న కోహ్లీ మిగతా ఆటగాళ్లకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇప్పటివరకు 177 మ్యాచ్‌లు ఆడి 169 ఇన్నింగ్స్‌ల్లో 37.84 సగటుతో 5,412 పరుగులు సాధించాడు విరాట్.
సురేశ్ రైనా (చెన్నై సూపర్ కింగ్స్)
ఒకప్పుడు టీమ్ఇండియా మిడిలార్డర్లో ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు రైనా. ప్రస్తుతం ఫామ్ కోల్పోయాడు. తిరిగి తుది జట్టులో స్థానం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు. ప్రతి ఐపీఎల్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసే ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ మొత్తం ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో రెండో స్థానంలో ఉన్నాడు. 193 మ్యాచ్‌లు ఆడి 189 ఇన్నింగ్స్‌ల్లో 33.34 సగటుతో 5,368 పరుగులు చేశాడీ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు.