సరిగ్గా పదేళ్ల క్రితం.. ఇదే రోజు మ్యాచ్‌ను ముగించేందుకు ధోని కొట్టిన ఓ బంతి అమాంతం స్టాండ్స్‌లో పడింది. అంతే స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు దేశంలోని కోట్లాది మంది ప్రజలు పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. ఊరు ఊరునా.. వాడ వాడలా జాతీయ పతాకాలు రెపరెపలాడాయి. ప్రతి భారతీయుడి మనసు సంతోషంలో మునిగితేలింది. మరి అప్పుడు జట్టు సాధించిన విజయం ఏమైనా సాధారణమైందా? కానే కాదు.. 28 ఏళ్ల ప్రపంచకప్ కలను నిజం చేసిన గెలుపది. రెండోసారి టీమ్‌ఇండియాకు వన్డే ప్రపంచకప్‌ను అందించిన విజయమది. స్వప్నం సాకారమైన ఆ క్షణానికి నేటితో పదేళ్లు! 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరిగి ఈ రోజుతో (ఏప్రిల్ 2) దశాబ్దం గడిచింది.
భారత జట్టు రెండోసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడి అప్పుడే దశాబ్దం గడిచిపోయిందా? శ్రీలంకతో ఆ ఫైనల్ మ్యాచ్ ఇప్పటికీ కళ్లు ముందు కదులుతోంది. ఛేదనలో ఆరంభంలో గంభీర్ (97) అద్భుత పోరాటం.. ఆఖర్లో ధోని (91 నాటౌట్) అద్వితీయమైన ప్రదర్శన.. మ్యాచ్‌ను ముగించిన ఆ సిక్సర్.. మైదానంలో మోకాళ్లపై కూర్చొని యువీ కన్నీళ్లు కార్చిన దృశ్యం! "ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్. ఏ మేగ్నిఫిషెంట్ స్ట్రైక్ ఇన్‌టూ ది క్రౌడ్! ఇండియా లిఫ్ట్ ది వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 ఇయర్స్ (ధోని తనదైన శైలిలో ముగించాడు. అద్భుతమైన షాట్‌తో బంతిని జనాల్లోకి పంపాడు. 28 ఏళ్ల తర్వాత భారత్ ప్రపంచకప్ అందుకుంది)" అని గంభీరమైన గొంతుతో వ్యాఖ్యాతగా రవిశాస్త్రి చెప్పిన మాటలు.. ఈ విజయంతో సచిన్ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన జట్టు ఆటగాళ్లు మ్యాచ్ ముగిశాక అతణ్ని భుజాలపై ఎత్తుకొని మైదానంలో తిరగడం.. ఇలా ఇప్పటికీ ఆ సన్నివేశాలు తాజాగా కనిపిస్తున్నాయి. 1983లో కపిల్‌దేవ్ సారథ్యంలో తొలి ప్రపంచకప్ విజయం తర్వాత.. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అందిన ఈ మహత్తర విజయం.. సచిన్ కెరీర్‌ను పరిపూర్ణం చేసింది. సొంతగడ్డపై దక్కిన ఈ గెలుపు కెప్టెన్‌గా ధోనీకి ఘనకీర్తిని తెచ్చిపెట్టింది. మొత్తంగా క్రికెట్‌ను పిచ్చిగా అభిమానించే దేశానికి గొప్ప కిక్కును అందించింది.
ఎంతో తేడా..
ఆ ప్రపంచకప్ విజయానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి పరిస్థితులు, జట్టు, ఆటను పోల్చి చూస్తే ఎంతో తేడా.! ఆనాటి జట్టులో ఉన్న ఆటగాళ్లలో కోహ్లి.. స్పిన్నర్ అశ్విన్ మాత్రమే ఇంకా టీమ్‌ఇండియాకు ఆడుతున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా ఎదిగిన విరాట్ మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా జట్టును సమర్థంగా నడిపిస్తున్నాడు. మరోవైపు ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్న అశ్విన్ ఇప్పుడు కేవలం టెస్టులకే పరిమితమయ్యాడు. సచిన్, సెహ్వాగ్, గంభీర్, జహీర్, నెహ్రా, ధోని, యువరాజ్ లాంటి దిగ్గజాలు ఒకరి తర్వాత ఒకరుగా ఆటకు వీడ్కోలు పలికారు. రైనా, పియూష్ చావ్లా, మునాఫ్ పటేల్, యూసుఫ్ పఠాన్, ప్రవీణ్ కుమార్‌లు కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంకా ఆటకు వీడ్కోలు పలకనప్పటికీ హర్భజన్ జాతీయ జట్టుకు దూరమై చాలా కాలమవుతోంది.