తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ త్వరలో ప్రపంచకప్​ గెలుస్తాడు: భజ్జీ

స్టార్ కెప్టెన్ కోహ్లీ.. త్వరలోనే ప్రపంచకప్​ సాధిస్తాడని సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. రానున్న రెండేళ్లలో అది జరిగే అవకాశముందని చెప్పాడు.

The time is very near when Virat Kohli will be lifting the World Cup: Harbhajan Singh
కోహ్లీ త్వరలో ప్రపంచకప్​ గెలుస్తాడు: భజ్జీ

By

Published : Nov 23, 2020, 12:34 PM IST

టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఎంతటి గొప్ప బ్యాట్స్‌మనో.. అంతే గొప్ప సారథి. ఐదేళ్లుగా అటు టెస్టుల్లో.. గత మూడేళ్లుగా వన్డేల్లో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఈ క్రమంలోనే భారత జట్టును అత్యుత్తమంగా ముందుకు తీసుకెళుతున్నాడు. అయితే, విరాట్ ఎన్ని విజయాలు సాధించినా అతడి కెరీర్‌లో ఇప్పటివరకూ ఓ లోటు ఉంది. అదే ఐసీసీ ట్రోఫీ గెలవకపోవడం. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ సందర్భంగా తొలిసారి ఆ అవకాశాన్ని కోల్పోయిన కోహ్లీ.. గతేడాది వన్డే ప్రపంచకప్‌లోనూ రెండోసారి సువర్ణ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దీంతో తన సారథ్యంలో ఐసీసీ కప్పు సాధించాలనే కోరిక అలాగే ఉండిపోయింది. అయితే, త్వరలోనే టీమ్‌ఇండియా సారథి ఆ ఘనత సాధిస్తాడని వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు.

సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్

'ఏ కెప్టెన్‌ అయినా ప్రపంచకప్‌ సాధించాలని అనుకుంటాడు. 2021లో కోహ్లీ అది సాధిస్తే బాగుంటుంది. దాంతో అతడేం పెద్ద ఆటగాడు అయిపోడు. ఎందుకంటే కోహ్లీ ఇప్పటికే గొప్ప క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు‌. కానీ ప్రపంచకప్‌ గెలవడం అనేది అతడి కీర్తి ప్రతిష్ఠలకు మరింత వన్నె తెస్తుంది. ఇప్పుడున్న టీమ్‌ని బట్టి చూస్తే కోహ్లీ ఐసీసీ కప్పు సాధించకుండా వెనుతిరగడని అనిపిస్తోంది. త్వరలోనే ఆ కలను నిజం చేసుకుంటాడు. బహుశా 2021లో లేదా తర్వాతి సీజన్‌లో..' అని భజ్జీ అన్నాడు.

కోహ్లీ నేతృత్వంలో టీమ్‌ఇండియా.. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్‌ చేతిలో ఓడిపోయింది. గతేడాది ప్రపంచకప్‌ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో విఫలమైంది. దీంతో టీమ్‌ఇండియా రెండుసార్లు కప్పు చేజార్చుకుంది.

ABOUT THE AUTHOR

...view details