ఆస్ట్రేలియాలో క్వారంటైన్ ఆంక్షలు కఠినంగానే కాక.. విచిత్రంగానూ అనిపించాయని టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఇరు జట్లు ఒకే బయో బుడగలో ఉన్నప్పటికీ.. ఆసీస్ ఆటగాళ్లున్న లిఫ్ట్‌లోనికి తమను ఎక్కనివ్వలేదని పేర్కొన్నాడు. ఆ సమయంలో చాలా బాధగా అనిపించిందని యాష్ వెల్లడించాడు.
కరోనా వైరస్ వల్ల ఆసీస్ పర్యటన సాంతం టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఆంక్షల్లో ఉండాల్సి వచ్చింది. బయో బుడగలో ఉన్నప్పటికీ సిడ్నీ, మెల్‌బోర్న్, బ్రిస్బేన్లలో వేర్వేరు నిబంధనలు పాటించాల్సి వచ్చింది. అక్కడి సాధారణ పౌరుల కన్నా కఠినంగా భారత ఆటగాళ్లకు నిబంధనలు విధించారు. ఆసీస్‌లో అడుగుపెట్టిన వెంటనే కఠిన క్వారంటైన్‌లో ఉన్నా.. బ్రిస్బేన్‌లోనూ మళ్లీ క్వారంటైన్ కావాలని ఆదేశించారు. బీసీసీఐ జోక్యం చేసుకోవడంతో కొన్నింటిని మినహాయించారు. చిత్రవిచిత్రమైన ఆంక్షలు విధించడమే కాకుండా భారత ఆటగాళ్లు నిబంధనలు పాటించేందుకు ఇష్టపడటం లేదన్నట్టుగా అక్కడి మీడియా దుష్ప్రచారానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే.