సౌతాంఫ్టన్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో అఫ్గానిస్థాన్‌పై 11 పరుగుల తేడాతో గెలిచింది టీమిండియా. ఈ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ ఆడిన షమి హ్యాట్రిక్‌తో విజయాన్ని తెచ్చిపెట్టాడు. అనంతరం మీడియా సమావేశంలో ఈ గెలుపుపై కెప్టెన్ కోహ్లీ స్పందించాడు.
"ఈ మ్యాచ్ మాకు చాలా ముఖ్యమైనది. పరిస్థితులు అనుకూలించనప్పుడు చివరి బంతి వరకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. భారత్ బౌలింగ్ అమోఘం. అందివచ్చిన అవకాశాన్ని షమి సద్వినియోగం చేసుకున్నాడు. టాస్ గెలవగానే బ్యాటింగ్ తీసుకుని భారీ స్కోరు చేయాలనుకున్నాం. పిచ్ నెమ్మదిగా ఉన్నందున 260-270 పరుగులు చేస్తే ప్రత్యర్థిని అడ్డుకోవచ్చు అనుకున్నాం. కానీ అఫ్గానిస్థాన్ ఒక సమయంలో మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టింది. చివరకు సమష్టిగా రాణించి విజయం సాధించాం. ఈ గెలుపు ఇచ్చిన విశ్వాసంతో రానున్న మ్యాచ్‌ల్లో మరింత బాగా ఆడతాం." -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్