అర్ధరాత్రి దాటాక ప్రేయసి ఇంటికి వెళ్లడం.. గేటుకు తాళం వేసి ఉంటే గోడ దూకడం.. చివరికి ప్రేయసిని కలిసి ఆమెను ఆశ్చర్యానికి గురిచేయడం! ప్రేమకథా చిత్రాల్లో తరచూ కనిపించే దృశ్యమిది!. కానీ అమాయకంగా.. సిగ్గరిగా కనిపించే టీమ్ఇండియా ఆటగాడు హనుమ విహారి ఇలాంటి పని చేశాడంటే ఎవరూ నమ్మకపోవచ్చు! కానీ నిజంగా నిజమిది. తాజాగా ఓ ప్రైవేట్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విహారి తన ప్రేమ పాట్లను వివరించాడు.
"నా ప్రాణ స్నేహితుడు, నేను ఒకరోజు అర్ధరాత్రి దాటేవరకు హైదరాబాద్‌లోని ఓ క్లబ్‌లో ఉన్నాం. అక్కడ నుంచి డిన్నర్ కోసం ఓ డ్రైవ్‌ఇన్‌కు వెళ్లాం. అకస్మాత్తుగా ప్రీతిని కలవాలన్న కోరిక కలిగింది. తల్లిదండ్రులతో కలిసి ఆమె వరంగల్‌లో ఉంటుంది. హైదరాబాద్ నుంచి సుమారు 3 గంటల ప్రయాణం. రాత్రి ఒంటి గంటకు స్నేహితుడితో కలిసి వరంగల్‌కు బయల్దేరా. ఒక చేత్తో బిర్యానీ.. మరో చేత్తో సాంబార్ అన్నం పట్టుకుని స్నేహితుడు కూర్చున్నాడు. తీరా వరంగల్‌కు వెళ్లాక ప్రీతి ఇంటి గేటుకు తాళం వేసి ఉంది. ఆమె బయటకు రాలేని పరిస్థితి. ఎలాగైనా ప్రీతిని కలవాలని అనుకున్నా. ఇంట్లోవాళ్లు చూస్తే గోడ దూకి పారిపోవాలని అనుకున్నా. ఎందుకైనా మంచిదని నా స్నేహితుడు డ్రైవర్ సీట్లో కూర్చొని కారు స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్నాడు. గేటు దూకి.. గోడ ఎక్కి ప్రీతిని కలిశా. అదృష్టవశాత్తు ఎవరూ చూడలేదు"