భారత జట్టు కోచ్ రవిశాస్త్రిపై సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. కోహ్లీ మద్దతు వల్లే అతను పదవిలో కొనసాగుతున్నాడని, కోచ్‌గా శాస్త్రి చేసేదేమీ లేదని నెటిజన్లు ట్వీట్లు చేశారు. ఈ విషయంపై రవిశాస్త్రి స్పందించకపోయినా.. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. విమర్శకుల్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడాడు.
దురుద్దేశంతోనే శాస్త్రిని టార్గెట్ చేశారు: కోహ్లీ - శాస్త్రిని ట్రోల్ చేయడం ఆపండి: విరాట్ కోహ్లీ
టీమిండియా కోచ్ రవిశాస్త్రిపై దురుద్దేశపూర్వకంగానే ట్రోలింగ్ చేస్తున్నారని సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. చెప్పిన ప్రతి మాటకు ఆయన తలూపుతాడనే దృక్పథం తప్పని తెలిపాడు. పదో స్థానంలో జట్టులోకి వచ్చి ఓపెనర్‌గా 41 సగటు సాధించిన వ్యక్తిని విమర్శించాలంటే ఆ స్థాయిలో కష్టపడ్డవాళ్లే అయ్యుండాలన్నాడు.
" ఉద్దేశపూర్వకంగానే రవిశాస్త్రిని విమర్శిస్తున్నారు. అతను స్పిన్నర్‌గా కెరీర్ మొదలుపెట్టి జట్టులో విలువైన ఆటగాడిగా మారాడు. చివరికి ఓపెనర్‌గా పదోన్నతి పొందాడు. ఆ స్థానంలో 41 సగటుతో పరుగులు చేశాడు. అలాంటి వ్యక్తిని ఇంట్లో ఖాళీగా కూర్చునే వాళ్లు విమర్శిస్తున్నారు. అతను ఎదుర్కొన్న బౌలర్లను ఎదుర్కొని, సాధించినవన్నీ మీరూ చేశాక .. ఇలాంటి వాటిపై చర్చకు రావాలి."
- విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి
ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా జట్టు మంచి కోసమే రవిశాస్త్రి ఆలోచిస్తుంటాడని భారత కెప్టెన్ అన్నాడు. టీమిండియా కోచ్.. 1985 వరల్డ్ సిరీస్ క్రికెట్‌లో "ఛాంపియన్స్ ఆఫ్ ఛాంపియన్స్" పురస్కారం అందుకున్న సంగతిని కోహ్లీ గుర్తుచేశాడు.