భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్ భవితవ్యం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ తర్వాత ఏ సిరీస్‌కు ధోనీ అందుబాటులో లేడు. తాజాగా ప్రకటించిన విండీస్‌తో సిరీస్‌లోను ఈ స్టార్ ప్లేయర్‌కు చోటు దక్కలేదు. అయితే తాజాగా బీసీసీఐ అధ్య క్షుడు గంగూలీ ఈ విషయంపై స్పందించాడు. ధోనీ కెరీర్‌పై పూర్తి స్పష్టత ఉందని అన్నాడు.
" ధోనీ భవితవ్యం గురించి పూర్తి స్పష్టత ఉంది. కానీ ఆ విషయాలను బహిరంగ వేదికపై వెల్లడించలేం. భవిష్యత్తులో మీకే తెలుస్తుంది. బోర్డు, ధోనీ, సెలక్టర్ల మధ్య చాలా స్పష్టత ఉంది. ధోనీ భారత్‌కు అద్భుతమైన ఆటగాడు. అతడి భవిష్యత్తుపై నిర్ణయాలు గోప్యంగానే ఉంటాయి. అవి ఎంతో పారదర్శకంగా ఉంటాయి".
- సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
2020 ఐపీఎల్ తర్వాతే ధోనీ తన భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకుంటాడని అతడి సన్నిహిత వర్గాలు ఇటీవలే వెల్లడించాయి. టీమిండియా కోచ్ రవిశాస్త్రి కూడా ధోనీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఐపీఎల్‌లో ఎలా ఆడతాడనే దానిపైనే ధోనీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అన్నాడు.
ఈ ఏడాది ప్రపంచకప్ సెమీస్ అనంతరం ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. భారత ఆర్మీకి సేవలందించాలనే ఉద్దేశంతో అతడు వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్‌లకు అందుబాటులో లేడు. డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌కూ దూరమయ్యాడు. అయితే తాజాగా మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టి అభిమానుల్లో ఆసక్తిని పెంచాడు.