ఐపీఎల్ 13వ సీజన్‌లో బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ, ఓ మ్యాచ్‌లో ముంబయి బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌ను స్లెడ్జింగ్ చేయబోయిన వీడియో ఇటీవల సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ఆ మ్యాచ్‌లో ముంబయి 165 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగగా సూర్య (79 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి ఆ జట్టును గెలిపించాడు. ఈ క్రమంలోనే కోహ్లీ.. సూర్య వైపు గంభీరంగా చూస్తూ దగ్గరికి వెళ్లాడు. అప్పుడు సూర్య కూడా అలానే చూస్తూ పక్కకు వెళ్లిపోయాడు. ఈ విషయమై మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్.. మ్యాచ్ తర్వాత కోహ్లీ తనని మెచ్చుకున్నాడని చెప్పాడు. మ్యాచ్ జరిగేటప్పుడు బెంగళూరు సారథి ఒత్తిడిలో ఉన్నాడని, మ్యాచ్ గెలిచాక తన వద్దకు వచ్చి మంచి ఇన్నింగ్స్ ఆడావని ప్రశంసించినట్లు తెలిపాడు. తాను కూడా ఆ ఇన్నింగ్స్‌ను ఆస్వాదించినట్లు సూర్య వెల్లడించాడు.
దీంతోపాటే లాక్‌డౌన్ సమయంలో తమ ప్రాక్టీస్ కోసం ముంబయి ఇండియన్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని తెలిపాడు. ముంబయి మొత్తం వర్షపు నీటితో నిండిపోయినా తాము రిలయన్స్ స్టేడియంలో సాధన చేసినట్లు చెప్పాడు.
"బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేందుకు మూడు వేర్వేరు పిచ్‌లతో సిద్ధం చేసిన పెద్ద పై కప్పు ఏర్పాటు చేసింది. ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్లినా అక్కడా అద్భుతమైన ఏర్పాట్లు చేసింది. కఠిన పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన జాగ్రత్తలతో పాటు మంచి భోజనం, హాటల్ వసతి, ఆటవిడుపు అంశాల్లో అత్యుత్తమ సౌకర్యాలు కల్పించింది. మా కోసమే ప్రత్యేక చెఫ్‌ను నియమించి.. ఏది కావాలంటే అది వండి పెట్టారు. మ్యాచ్‌లు లేని సమయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పార్టీలు చేసుకున్నాము. దాంతో బయోబబుల్ లాంటి వాతావరణంలో కుటుంబసభ్యుల ప్రాముఖ్యత ఎలాంటిదో మా జట్టు అర్థం చేసుకుంది."
-సూర్యకుమార్ యాదవ్, ముంబయి బ్యాట్స్‌మన్