కరోనా తర్వాత క్రికెట్ పునరుద్ధరణకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ఐసీసీ... బంతిని ఉమ్మితో రుద్దడాన్ని నిషేధించింది. ఈ నిర్ణయంపై తాజాగా స్పందించాడు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్‌స్మిత్.
"బ్యాటు, బంతి మధ్య సరైన పోటీ ఉండాలని కోరుకొనే వ్యక్తిని నేను. ఉమ్మితో రుద్దడాన్ని నిషేధించడం సమర్థించను. ఇందుకు ప్రత్యామ్నాయం సైతం కష్టమే. బంతిపై పట్టు చిక్కేందుకు నా చేతుల్లో ఉమ్మివేసుకొని రుద్దుతాను. ఏదేమైనప్పటికీ ఇవన్నీ సర్దుకోవాలంటే కొంత సమయం పడుతుంది. దీనిపై ముందుకు వెళ్లేందుకు ఐసీసీ ఏం చేస్తుందో చూడాలి" అని స్మిత్ పేర్కొన్నాడు.
ఐపీఎల్‌కే మొదటి ప్రాధాన్యం...
టీ20 ప్రపంచకప్ వాయిదాపడి ఆ స్థానంలో ఐపీఎల్ జరిగితే తాను కచ్చితంగా ఆడతానని అన్నాడు స్టీవ్‌స్మిత్. దేశవాళీ కంటే ఈ లీగ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని తెలిపాడు. ప్రస్తుతం ఇతడు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.
"వన్డే, టీ20.. ఫార్మాట్ ఏదైనా దేశం తరఫున ప్రపంచకప్ ఆడటమే గొప్ప అవకాశం. ఒకవేళ టోర్నీ వాయిదాపడి ఐపీఎల్ జరిగితే అందులో ఆడతా. అదో అద్భుతమైన లీగ్. ప్రస్తుతం పరిస్థితులు ఎవరి నియంత్రణలోనూ లేవు. ప్రపంచకప్ వాయిదా పడుతుందో లేదో తెలియదు. జరిగితే గొప్ప. క్రికెట్‌కు పరిస్థితులు అనుకూలించకపోతే చేసేదేమీ లేదు. అప్పటి వరకు ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకోవాలి. ఇంట్లో కూర్చొని ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి సారించడమే ముందున్న లక్ష్యం" అని స్మిత్ అన్నాడు.
కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరగాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రస్తుతం అక్టోబర్ నిర్వహించాల్సిన.. టీ20 ప్రపంచకప్ జరిగేలా కనిపించడం లేదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.
ఇదీ చూడండి: విదేశీ ఆటగాళ్లు లేకుండా ఐపీఎల్ సాధ్యమేనా?