పాకిస్థాన్‌లో పర్యటనకు సిద్ధమైన శ్రీలంక జట్టుకు సిరీస్‌కు ముందే భయం మొదలైంది. పాక్ వెళ్లేందుకు ఇప్పటికే 10 మంది క్రికెటర్లు వెనకడుగు వేయగా.. తాజాగా పర్యటనకు వెళ్లిన యువ బృందం ఎన్నో పూజలు చేసుకొని బయల్దేరింది. స్వదేశానికి క్షేమంగా తిరిగిరావాలని బౌద్ధ గురువుల ఆశీర్వాదాలు తీసుకొని వారి చేత తాయెత్తులు కట్టించుకున్నారు.
తాయెత్తులు కట్టించుకుంటున్న ఆటగాళ్లు పాకిస్థాన్ జట్టుతో సెప్టెంబర్ 27 నుంచి ఆరంభమయ్యే మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో పాకిస్థాన్‌తో తలపడుతుంది శ్రీలంక. ఈ పర్యటనకు వెళ్లేముందు లంక ఆటగాళ్లు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఫొటోలను లంక బోర్డు ట్విట్టర్లో పోస్టు చేసింది.
బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో...
భద్రత పట్ల ఆందోళన ఉన్నప్పటికీ పాకిస్థాన్‌లో పర్యటించాలని నిర్ణయించుకున్న శ్రీలంక క్రికెట్ జట్టు.. మంగళవారం ఆ దేశంలో అడుగు పెట్టింది. లంక ఆటగాళ్లను అధ్యక్ష స్థాయి భద్రత ఏర్పాట్ల మధ్య బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో హోటల్‌కు తరలించినట్లు పాక్ అధికారులు వెల్లడించారు.
కెప్టెన్ దిముత్ కురణరత్నె, లసిత్ మలింగ సహా పది మంది సీనియర్ ఆటగాళ్లు పాక్ వెళ్లేందుకు విముఖత ప్రదర్శించారు. ఫలితంగా ఈ సిరీస్‌లకు ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేసింది లంక బోర్డు.
ఆ భయమే ఇంకా...
2009లో పాక్ పర్యటన సందర్భంగా.. శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఆ ఘటనలో ఆరుగురు లంక ఆటగాళ్లు గాయపడగా.. మరో ఆరుగురు పోలీసులు, ఇద్దరు పౌరులు మృతి చెందారు. దాడి తర్వాత ఆ దేశంలో పర్యటించేందుకు ప్రపంచ దేశాలు వెనకడుగు వేస్తున్నాయి.