తెలంగాణ

telangana

ETV Bharat / sports

'స్వలాభం కోసం కొంతమంది నాకు మద్దతివ్వలేదు' - కేరళ పేసర్

టీమిండియా క్రికెటర్​ శ్రీశాంత్​కు ఎట్టకేలకు ఊరట లభించింది. అతడిపై జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు కుదించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ జస్టిస్​ డీకే జైన్‌. ఈ తాజా నిర్ణయం తర్వాత ఈటీవీ భారత్​తో మాట్లాడాడీ కేరళ పేసర్​.

'స్వలాభం కోసం కొంతమంది నాకు మద్దతివ్వలేదు'

By

Published : Aug 20, 2019, 10:51 PM IST

Updated : Sep 27, 2019, 5:14 PM IST

భారత క్రికెటర్​ శ్రీశాంత్​ వచ్చే ఏడాది క్రికెట్​ జెర్సీ ధరించనున్నాడు. అతడిపై ఇది వరకు బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు కుదించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ జస్టిస్​ డీకే జైన్‌. ఇప్పటికే ఆరేళ్ల శిక్ష అనుభవించిన శ్రీ... 2020 ఆగస్టులో విముక్తి పొందనున్నాడు. ఈ తాజా నిర్ణయంపై మాట్లాడాడు శ్రీశాంత్​. కేరళ తరఫునే కాకుండా జాతీయ జట్టులోనూ, విదేశీ లీగుల్లో ఆడాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు.

నిషేధం తగ్గించిన తర్వాత ఈటీవీ భారత్​తో మాట్లాడుతున్న శ్రీశాంత్​

" ఈ వేటు కాలంలో చాలా ఇబ్బందిపడ్డాను. అయినా ధైర్యంగా ఎదుర్కొన్నా. కష్టకాలంలో నాకు తోడుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. కొంతమంది వారి కారణాలతో నాకు మద్దతివ్వలేదు. సుప్రీంకోర్టు, అంబుడ్స్​మన్​ డీకే జైన్​కు​ నా ధన్యవాదాలు. వచ్చే ఏడాది మళ్లీ మైదానంలో దిగుతాననే వార్త చాలా ఆనందాన్నిచ్చింది. దాని కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభిస్తా. నా అభిమానులను ఏ మాత్రం నిరాశ పెట్టను. కచ్చితంగా నా ప్రదర్శనతో దేశం తరఫున ఆడేందుకు ప్రయత్నిస్తా. ఈ ఆరేళ్ల కాలంలో సినిమాల ద్వారా ప్రజలకు చేరువగా ఉన్నా. నేను ఒప్పుకొన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసి వీలైనంత సమయం క్రికెట్​ కోసం కేటాయిస్తా.
-- శ్రీశాంత్​, క్రికెటర్​

కెరీర్‌లో అత్యున్నత దశలో ఉన్నప్పుడు శ్రీశాంత్‌ నిషేధానికి గురయ్యాడు. రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడుతున్న అతడిపై 2013 ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చాయి. శ్రీ సహా అజిత్‌ చండీలా, అంకిత్‌ చవాన్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. తనపై నిషేధం ఎత్తివేయాలని అప్పటి నుంచి శ్రీశాంత్‌ న్యాయ పోరాటానికి దిగాడు. దిగువ కోర్టుల్లో, కేరళ హైకోర్టులోనూ ఊరట లభించినా... బీసీసీఐ మళ్లీ మళ్లీ పై కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసింది. ఈ ఏడాది మార్చి 15న సుప్రీం కోర్టు అతడిపై నిషేధం తొలగించింది. శిక్ష తగ్గించి న్యాయం చేయాలని బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ను ఆదేశించింది. తాజాగా అతడిపై జీవిత కాలం నిషేధాన్ని 7 ఏళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు అంబుడ్స్​మన్​ డీకే జైన్​.

టీమిండియా తరఫున శ్రీశాంత్‌ 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. 169 వికెట్లు తీశాడు. 2011లో భారత జట్టుకు చివరి మ్యాచ్‌ ఆడాడు.

Last Updated : Sep 27, 2019, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details