డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, లబుషేన్‌తో ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలంగా మారినా, వారిని కట్టడి చేయడానికి తమ బౌలర్లు సిద్ధంగా ఉన్నారని టీమ్ఇండియా సీనియర్ బ్యాట్స్‌మన్ చెతేశ్వర్ పుజారా అన్నాడు. తాజాగా అతడు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ గురించి మాట్లాడాడు. ఇందులో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశాడు.
"విదేశాల్లో విజయాలు అంత సులువుగా దక్కవు. ఎంతో శ్రమించాలి. 2018-19తో పోలిస్తే ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ బలంగా మారి ఉండొచ్చు. స్మిత్, వార్నర్, లబుషేన్ ఉత్తమ ప్లేయర్లు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మా వద్ద అత్యుత్తమ బౌలర్లు ఉన్నారు. అంతేకాకుండా వారిలో ఎక్కువ మంది గతంలో ఇక్కడ సత్తాచాటినవారే. ఆస్ట్రేలియాలో ఎలా రాణించాలో వారికి బాగా తెలుసు. స్మిత్, వార్నర్, లబుషేన్‌ను ఎలా బోల్తా కొట్టించాలో మా వద్ద ప్రణాళికలు ఉన్నాయి. వాటిని విజయవంతంగా అమలుచేస్తాం. గత పర్యటనలో మాదిరిగా గొప్ప ప్రదర్శన చేస్తే తప్పక సిరీస్‌ను గెలుస్తాం"
-పుజారా, టీమ్ఇండియా సీనియర్ బ్యాట్స్‌మన్.
ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి డే అండ్ నైట్ టెస్టు గురించి పూజారా మాట్లాడుతూ.. "గులాబీ బంతితో ఆడటం సవాలు , పేస్, బౌన్స్‌లో మార్పులు వస్తుంటాయి" అని చెప్పాడు. గతంలో ఆసీస్‌పై సమష్టిగా రాణించి విజయం సాధించామని గుర్తుచేసుకున్నాడు.