తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నిరాశ చెందా.. భవిష్యత్తులో జట్టులోకి వస్తా' - bcci

వెస్టిండీస్​లో పర్యటించే టీమిండియా జట్టులో భారత యువ ఆటగాడు శుభ్​మన్​ గిల్​కు చోటు దక్కలేదు. ఈ విషయంపై స్పందించాడీ క్రికెటర్. అవకాశం రాకపోవడం బాధగా ఉన్నా.. త్వరలో జట్టులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

గిల్

By

Published : Jul 24, 2019, 1:27 PM IST

ఇటీవలే వెస్టిండీస్​ ఏ-ఇండియా ఏ మధ్య జరిగిన అనధికారిక వన్డే సిరీస్​లో అద్భుత ప్రదర్శన కనబర్చిన యువ ఆటగాడు శుభ్​మన్​ గిల్. ఈ ప్రదర్శనతో భారత జట్టులో చోటు దక్కించుకోవాలని భావించాడు. కానీ వెస్టిండీస్​తో జరగబోయే వన్డే, టెస్ట్, టీ20 సిరీస్​కు జట్టును ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ గిల్​కు అవకాశం కల్పించలేదు.

ప్రపంచకప్​ సెమీస్​లో ఓడి ఇంటిముఖం పట్టిన భారత్​కు మిడిలార్డర్ పెద్ద సమస్యగా మారింది. వెస్టిండీస్​తో జరిగే సిరీస్​లో ఈ స్థానాల్లో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తారని అంతా భావించారు. కానీ మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్​​ను ఎంపిక చేసిన సెలక్టర్లు శుభ్​మన్​కు మొండిచేయి చూపించారు.

వెస్టిండీస్​-ఏతో జరిగిన అనధికారిక వన్డే సిరీస్​లో... 54.50సగటుతో 218 పరుగులు సాధించాడు గిల్​. మ్యాన్ ఆఫ్​ ది సిరీస్​నూ​ గెల్చుకున్నాడు.

"వెస్టిండీస్ పర్యటన ఎంపికకై ఎదురుచూశా. ఏదో ఒక ఫార్మాట్​లో చోటు దక్కుతుందని భావించా. స్థానం లభించకపోవడంపై నిరాశ చెందా. కానీ అదే ఆలోచిస్తూ కూర్చోను. మరిన్ని పరుగులు సాధించి సెలక్టర్ల దృష్టిలో పడటానికి ప్రయత్నిస్తా".
-శుభమన్​ గిల్, యువ క్రికెటర్

ఈ పర్యటన కోసం జట్టును ప్రకటించే సందర్భంలో గిల్​ను ఎందుకు ఎంపిక చేయలేదో ప్రస్తావించాడు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.

"ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన న్యూజిలాండ్​తో సిరీస్​కు రాహుల్​కు గాయమైంది. అప్పుడు జట్టులోకి వచ్చాడు గిల్. రాహుల్ పునరాగమనంతో గిల్​కు ఎదురుచూపులు తప్పలేదు. భవిష్యత్తులో అతడి ఎంపికను పరిశీలిస్తాం".
-ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్

వెస్టిండీస్​-ఏతో జరిగే టెస్టు సిరీస్ జట్టులో ఉన్నాడు శుభ్​మన్. మొదటి మ్యాచ్​ బుధవారం ప్రారంభం కానుంది.

ఇవీ చూడండి.. 'జట్టులో వారు లేకపోవడం ఆశ్చర్యకరం'

ABOUT THE AUTHOR

...view details