యూఏఈ వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ (ఐపీఎల్) ఇటీవలే ముగిసిన క్రమంలో ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమ్ఇండియా జట్టు గురువారం సిడ్నీ చేరుకుంది. దాదాపుగా 14 రోజుల పాటు ఆటగాళ్లు నిర్బంధంలో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో సిడ్నీలోని తన హోటల్ గదిలో ఉన్న చిత్రాన్ని భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. క్వారంటైమ్ సమయంలో సరైన కంపెనీ అని ట్యాగ్ పెట్టాడు. అయితే ఆ ఫొటోలో శ్రేయస్ రకరకాల ఫోజులతో ఉన్న చిత్రాన్ని పంచుకున్నాడు. అంటే తనతో తానే నిర్బంధంలో సమయాన్ని గడుపుతున్నట్లు పేర్కొన్నాడు.
'సరైన వ్యక్తితో నిర్బంధంలో సమయాన్ని గడుపుతున్నా!' - ఆస్ట్రేలియ పర్యటనలో టీమ్ఇండియా
ఆస్ట్రేలియా పర్యటన కోసం సిడ్నీ చేరుకున్న టీమ్ఇండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్.. సోషల్‌మీడియాలో ఆసక్తికర పోస్టు పంచుకున్నాడు. తన క్వారంటైన్ సమయంలో సరైన వ్యక్తితో సమయాన్ని గడుపుతున్నట్లు తెలిపాడు.
శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్‌లో బ్యాట్స్‌మన్‌గా అత్యుత్తమ ప్రదర్శన చేయడం సహా.. కెప్టెన్‌గా తన జట్టును సమర్థవంతంగా ఫైనల్‌కు చేర్చడంలో విజయం సాధించాడు. అయితే ఐపీఎల్ ఫైనల్‌కు దిల్లీ క్యాపిటల్స్ చేరడం ఇదే తొలిసారి. శ్రేయస్ అయ్యర్ ఈ టోర్నీలో 500 పరుగుల మార్కును దాటి.. సీజన్లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు. 17 మ్యాచ్‌ల్లో 34.60 సగటుతో 519 రన్స్ చేశాడు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య నవంబరు 28 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత మూడు టీ20ల్లో ఇరు జట్లు తలపడనున్నాయి. డిసెంబరు 17 నుంచి క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్ట్రేలియా-భారత్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.