తెలంగాణ

telangana

ETV Bharat / sports

అత్యంత తక్కువ బంతుల్లో ముగిసిన టెస్టులు ఇవే!

భారత్-ఇంగ్లాండ్ మధ్య మొతేరా వేదికగా జరిగిన డేనైట్ టెస్టు రెండు రోజుల్లో ముగిసి విమర్శలకు తావిచ్చింది. కేవలం 842 బంతుల్లోనే ముగిసిన ఈ టెస్టు పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే టెస్టు చరిత్రలో ఇలాంటి తక్కువ బంతుల మ్యాచ్​లు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు టెస్టుల్లో అత్యంత తక్కువ బంతుల్లో ముగిసిన టాప్-3 మ్యాచ్​లను చూద్దాం.

shortest completed Tests in terms of balls bowled
అత్యంత తక్కువ బంతుల్లో ముగిసిన టెస్టులు ఇవే!

By

Published : Mar 2, 2021, 9:45 AM IST

ఇటీవల భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన డేనైట్ టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. కొందరు పిచ్​ బాగా లేదంటూ విమర్శలు చేయగా, మరికొందరు బ్యాట్స్​మెన్ టెక్నిక్ సరిగా లేదంటూ మాట్లాడారు. ఏది ఎలా ఉన్నప్పటికీ ఎంతో ఆసక్తిరేపిన పింక్ బాల్ టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగియడం అభిమానులను కాస్త నిరాశకు గురిచేసింది. 1935 తర్వాత ఇంత తక్కువ బంతుల్లో (842) మ్యాచ్ ముగియడం ఇదే మొదటిసారి కాగా మొత్తంగా ఈ లిస్టులో ఏడొవది. ఈ నేపథ్యంలో టెస్టు చరిత్రలో తక్కువ బంతుల్లో ముగిసిన టాప్-3 టెస్టు మ్యాచ్​ల వివరాలు చూద్దాం.

ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా (1932)

1932లో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఐదో టెస్టు తొందరగా ముగిసిపోయిన మ్యాచ్​గా నిలిచిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్​లో 36 పరుగులకే ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్​కు దిగిన ఆసీస్​ 155 పరుగులు చేసి 119 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​కు దిగిన సఫారీ జట్టు మరోసారి విఫలమై 45 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇన్నింగ్స్​ 72 పరుగుల తేడాతో ఆసీస్​ మ్యాచ్​ గెలిచింది. ఈ టెస్టు మొత్తంగా 656 బంతుల్లో ముగిసింది. టెస్టు చరిత్రలో అత్యంత తక్కువ బంతుల్లో ముగిసిన మ్యాచ్ ఇదే.

ఇంగ్లాండ్-వెస్టిండీస్ (1935)

ఈ మ్యాచ్​లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్​కు దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్​లో 102 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఇన్నింగ్స్​లో ఇద్దరు బ్యాట్స్​మెన్ మాత్రమే రెండంకెల స్కోర్ నమోదు చేశారు. తర్వాత ఇంగ్లాండ్​ మొదటి ఇన్నింగ్స్​లో ఏడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసి తెలివిగా డిక్లేర్ ఇచ్చింది. అనంతరం విండీస్ ఆరు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ ముందు 73 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ప్రారంభంలో రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ఆ తర్వాత కోలుకుంది. వాలీ హమ్మండ్ 29 పరుగులతో జట్టుకు విజయాన్నందించాడు. ఈ మ్యాచ్​ 672 బంతుల్లో ముగిసింది. టెస్టు చరిత్రలో అత్యంత తక్కువ బంతుల్లో ముగిసిన రెండో మ్యాచ్ ఇది.

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా (1888)

టెస్టు చరిత్రలో యాషెస్​కు గొప్ప పేరుంది. రెండు అత్యుత్తమ జట్లు పాల్గొనే ఈ సిరీస్​ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. యాషెస్​లో భాగంగా 1888లో జరిగిన ఓ టెస్టు ఇలా తక్కువ బంతుల్లోనే ముగిసిపోయింది. ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 172 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్​ ప్రారంభంలో మెరుగ్గా బ్యాటింగ్ చేసిన ఆసీస్​.. తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి 81 పరుగులకే కుప్పకూలింది. తర్వాత ఆసీస్​ను ఫాలోఆన్ ఆడించిన ఇంగ్లీష్ జట్టు.. రెండో ఇన్నింగ్స్​లో 71 పరుగులకే ఆలౌట్ చేసింది. ఫలితంగా ఇన్నింగ్స్​ 21 పరుగులతో గెలిచింది ఇంగ్లాండ్. ఈ మ్యాచ్ 788 బంతుల్లో ముగిసింది.

ఇవీ చూడండి: ప్రపంచకప్​లో సత్తాచాటిన సోదరులు వీరే!

ABOUT THE AUTHOR

...view details