పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. గతనెలలో ప్రారంభమైన పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) ఆరో సీజన్‌ను అర్ధాంతరంగా వాయిదా వేయడంపై మండిపడ్డాడు.
లీగ్ జరుగుతున్న సమయంలో కొంతమంది ఆటగాళ్లు బయోసెక్యూర్ నిబంధనల్ని ఉల్లంఘించడమే కాకుండా పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో లీగ్‌ను కొనసాగించడానికి ఆయా ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు. దీంతో పీఎస్‌ఎల్‌ను వాయిదా వేయగా... అక్తర్ ఇలా స్పందించాడు.
"సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. అందుకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బయోసెక్యూర్ పరిస్థితుల్ని పకడ్బందీగా అమలు చేయాల్సింది. ఉన్నతాధికారులు, మెడికల్ సిబ్బందిని శిక్షించాలి. వారు ఆటగాళ్ల జీవితాలతో ఆడుకున్నారు. బోర్డుతో పాటు దేశం పరువు తీశారు."