టీమిండియా కొత్త కోచ్ ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఈ పదవి కోసం పోటీ పడుతున్న ఆరుగురు.. క్రికెట్ సలహా కమిటీ శుక్రవారం నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కానున్నారు. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రితో పాటు మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్, శ్రీలంక కోచ్ టామ్ మూడీ, గత ఐపీఎల్లో పంజాబ్ జట్టుకు పనిచేసిన మైక్ హెసన్ పేర్లు ఎక్కువగా వినపడుతున్నాయి.
2007లో భారత టీ20 జట్టుకు మేనేజర్‌గా పనిచేసిన లాల్‌చంద్ రాజ్‌పుత్, ముంబయి ఇండియన్స్ మాజీ కోచ్ రాబిన్ సింగ్, వెస్టిండీస్ ఆటగాడు, అఫ్గానిస్థాన్ కోచ్ ఫిల్ సిమోన్స్.. సీఏసీ ముందు తుది దశ ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారిలో ఉన్నారు. కపిల్ దేవ్ ఆధ్వర్యంలోని సీఏసీలో శాంతా రంగస్వామి, అన్షుమన్ గైక్వాడ్ ఇతర సభ్యులుగా ఉన్నారు.
లాల్‌చంద్, రాబిన్ సింగ్, సిమోన్స్ శాస్త్రికే మరోసారి పట్టం ..!
2017లో టీమిండియాకు కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి పనితీరుపై క్రికెట్ సలహా కమిటీ సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మరోసారి కోచ్‌గా రవి భాయ్ అయితేనే బాగుంటుందని సారథి కోహ్లీ ఇప్పటికే చెప్పాడు.
రవి శాస్త్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా.. 21 టెస్టులు ఆడగా 13 మ్యాచ్‌లు గెలిచింది. 36 టీ20ల్లో 25 మ్యాచ్‌లు గెలిచింది. వన్డేల్లో రికార్డు మరింత మెరుగ్గా ఉంది. మొత్తం 60 వన్డేల్లో 43 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ గణాంకాలు మెరుగ్గానే కనిపిస్తున్నా.. ఓ స్పష్టమైన లోటు ఆందోళన కలిగిస్తోంది. రవిశాస్త్రి డైరక్టర్‌గా 2015 ప్రపంచకప్, కోచ్‌గా 2019 వరల్డ్‌కప్.. ఇలా రెండింటిలోనూ సెమీస్ దాటలేకపోయింది టీమిండియా.
గత ఐపీఎల్లో పంజాబ్‌కు పనిచేసిన మైక్ హెసన్ రవిశాస్త్రికి పోటీగా ఉన్నాడు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీకీ అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు సార్లు ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నాడు మూడీ. అయితే అదృష్టం కలిసిరాలేదు. మరి ఈసారైనా ఆ పదవి వరిస్తుందేమో చూడాలి.
ప్రస్తుతం కరీబియన్ గడ్డపై పూర్తి ఆధిపత్యం చూపుతున్న కోహ్లీసేన విజయాలను తక్కువ చేసి చూపలేం. రవిశాస్త్రికి కోహ్లీ మద్దతు ఉండనే ఉంది. ఈ లెక్కన మరోసారి అతడికి కోచ్ పదవి దక్కడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న రవిశాస్త్రి.. స్కైప్ వీడియో కాల్ ద్వారా క్రికెట్ సలహా కమిటీ ముందు ఇంటర్వ్యూకు హాజరవనున్నాడు. రాజ్‌పుత్, హెసన్, రాబిన్ సింగ్ నేరుగా సీఏసీ ముందుకు రానున్నారు.
కెరీర్లో 80 టెస్టులు, 150 వన్డేలు ఆడిన రవిశాస్త్రి కోచ్ పదవి ప్రపంచకప్‌తోనే ముగిసింది. అనంతరం 45 రోజుల కాలవ్యవధిని పెంచిని బీసీసీఐ.. వెస్టిండీస్ పర్యటనకు అతడికే బాధ్యతలను అప్పగించింది. వీటిలో ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకుంది టీమిండియా.
కోచ్‌గా రవిశాస్త్రికి మరోసారి అవకాశం దక్కితే.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ పదవుల కోసం ఎమ్మెస్కే ప్రసాద్ ఆధ్వర్యంలోని కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌ల పదవులు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికై.. మరోసారి ఇదే సిబ్బందిని కొనసాగించాలని కోరితే తప్ప వీరికి అవకాశం దక్కే వీలులేదు.
ఫీల్డింగ్ కోచ్ కోసం శ్రీధర్‌కు, ముంబయి ఇండియన్స్ మాజీ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ నుంచి గట్టి పోటీ ఎదురవనుంది.
ఇవీ చూడండి.. 'నేను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు'