టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ తాజాగా తన జీవితంలో ఎదురైన ఓ కష్ట సమయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. చేతికి విపరీతమైన నొప్పి కలిగించే 'టెన్నిస్ ఎల్బో'తో 2004లో సచిన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అయితే గాయం బాధ ఉన్నా ఆటమీద ఇష్టంతో ఏడాది క్రికెట్‌ను కొనసాగించినట్లు చెప్పాడు. 2005లో ఆపరేషన్ తర్వాత డిప్రెషన్లోకి వెళ్లి క్రికెట్‌ను వదిలిపెట్టాలనీ అనుకున్నాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ కార్యక్రమంలో వెల్లడించాడు.
"టెన్నిస్ ఎల్బో అనేది చాలా ఇబ్బందికరమైంది. దీని వల్ల బ్యాట్‌ను ఎత్తలేం. అది ఎంత బాధాకరంగా ఉంటుందో అనుభవించిన వారికే తెలుస్తుంది. నొప్పికి ఊపిరి అందీ అందనట్టు ఉంటుంది. ఆ విషయంలో నా పరిస్థితి ఇంకా దారుణం. ఎన్నో ఇంజెక్షన్లు వేయించుకున్నా. ఎంతోమంది వైద్య స్నేహితులు నా బాధను తగ్గించేందుకు ప్రయత్నించారు. అయినా పరిస్థితి మారలేదు. 2005లో శస్త్ర చికిత్స చేయించుకున్నా. అయితే ఆ ఆపరేషన్ తర్వాత నేను క్రికెట్ ఆడలేనని అనుకున్నా. ఒక రకమైన నిరాశలోకి వెళ్లిపోయా. రాత్రి పూట నిద్రపట్టక నా స్నేహితులను పిలిచి కారులో లాంగ్ డ్రైవ్ వెళ్లేవాడిని. అయితే అలాంటి కష్ట సమయంలో నా భార్య అంజలి, ఆమె తల్లిదండ్రులు సహా కుటుంబ సభ్యులు, స్నేహితులు అండగా నిలిచారు."
- సచిన్ తెందూల్కర్, దిగ్గజ క్రికెటర్
ప్లాస్టిక్ బంతితో ఆట..
ఆపరేషన్ తర్వాత చిన్నపిల్లలతో కలిసి ప్లాస్టిక్ బంతితో ఆడుకున్నట్లు చెప్పాడు సచిన్. ఆ సమయంలో 10-15 ఏళ్ల పిల్లాడిలా షాట్లు కొట్టలేకపోయాడని.. కవర్ డ్రైవ్‌లు కొడితే పిల్లలు సులభంగా అడ్డుకునేవారని తెలిపాడు. అవన్నీ చూశాక తన కెరీర్ ముగిసినట్లు భావించినట్లు చెప్పుకొచ్చాడు మాస్టర్.