దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్.. మరోసారి బ్యాట్ పట్టేందుకు సిద్ధమయ్యాడు. అయితే పూర్తి మ్యాచ్ కోసం కాదు. కేవలం ఒక ఓవర్ మాత్రమే. ఆస్ట్రేలియాలోని కార్చిచ్చు బాధితులకు సహాయం చేసేందుకు, బుష్ఫైర్ ఛారిటీ మ్యాచ్ నిర్వహించనుంది ఆసీస్ క్రికెట్ బోర్డు. ఇందులో మాజీలతో పాటు సీనియర్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. రెండు జట్లకు పాంటింగ్, గిల్‌క్రిస్ట్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. టీమిండియా మాజీ దిగ్గజం సచిన్ మాత్రం ఓ జట్టుకు కోచ్‌గా పనిచేస్తున్నాడు. అయితే సచిన్‌కు బౌలింగ్ చేయాలన్న తన కోరికను, ఆసీస్ మహిళా క్రికెటర్ ఎలీస్ పెర్రీ సామాజిక మాధ్యమాల వేదికగా బయటపెట్టింది.
"హే సచిన్.. ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల కోసం నిర్వహిస్తున్న బుష్ఫైర్ ఛారిటీ మ్యాచ్‌కు మద్దతు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. కానీ మేమంతా ఓ అభిప్రాయానికి వచ్చాం. మీ రిటైర్మెంట్ను పక్కన పెట్టి ఒక ఓవర్ పాటు బ్యాటింగ్ చేయాలని మేం కోరుకుంటున్నాం. మీకు నేను బౌలింగ్ చేయడం చాలా బాగుంటుంది. అలాగే కొన్ని బంతులను బౌండరీ తరలిస్తారని ఆశిస్తున్నాం. ఇది బుష్ఫైర్ ఛారిటీకి మరికొంత ఎక్కువ డబ్బులు తెచ్చిపెడుతుందని భావిస్తున్నాం"
-ఎలీస్ పెర్రీ, ఆసీస్ మహిళా క్రికెటర్
వెంటనే స్పందించిన మాస్టర్.. పెర్రీకి మాటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పాంటింగ్, గిల్‌క్రిస్ట్ ఎలెవన్ మధ్య జరిగే మ్యాచ్ ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో పెర్రీ.. సచిన్‌కు ఒక ఓవర్ బౌలింగ్ చేయనుంది.