అంతర్జాతీయ క్రికెట్లో డిసిషన్ రివ్యూ సిస్టమ్(డీఆర్ఎస్)ను ఉపయోగించే సమయంలో 'అంపైర్ కాల్' నిబంధనను క్షుణ్ణంగా పరిశీలించాలని ఐసీసీని కోరాడు భారత దిగ్గజం సచిన్ తెందూల్కర్. దీనికి సంబంధించిన నిబంధనల్లో కొన్ని సవరణలు చేయాల్సిందిగా అభిప్రాయపడ్డాడు. ఆన్-ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో అసంతృప్తి చెందిన తర్వాత సమీక్షలు తీసుకునే ఆటగాళ్లకు అంపైర్ కాల్ నియమం న్యాయం చేయట్లేదని ట్వీట్ చేశాడు. భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో అంపైర్ కాల్ నిర్ణయాలు ఆసీస్ జట్టుకు అనుకూలంగా ఉంటున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు మాస్టర్.
'డీఆర్ఎస్తో ఆటగాళ్లకు న్యాయం జరగట్లేదు'
ఐసీసీ చొరవ తీసుకుని డీఆర్ఎస్ నిబంధనల్లో సవరణలు చేయాలని అభిప్రాయపడ్డాడు భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్. అంపైర్ కాల్ నిర్ణయంతో ఆటగాళ్లకు న్యాయం జరగట్లేదని తెలిపాడు.
రెండో టెస్టులో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో మూడో ఓవరు మొదటి బంతికే ఆసీస్ ఓపెనర్ బర్న్స్ ఎల్బీడబ్ల్యూ కోసం టీమ్ఇండియా అప్పీలు చేయగా అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. రీప్లేలో బంతి వికెట్ల అంచునకు తాకినట్టు కనిపించినా.. అంపైర్ కాల్ నిబంధన కింద నాటౌట్‌గా ప్రకటించాడు థర్డ్ అంపైర్. దీంతోపాటు ఇలాంటిదే మరో సంఘటన కూడా జరిగింది. కాగా, ఇప్పటికే రెండో టెస్టులో అంపైర్ కాల్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్. దీనికి సంబంధించిన నిబంధనలు మార్చాలని ఐసీసీని కోరాడు.
ఇదీ చూడండి: 'కోహ్లీ, రహానె దారులు వేరైనా.. లక్ష్యం ఒక్కటే'