ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు రోహిత్‌శర్మ ఆడుతాడా లేడా అనే విషయమై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. తాజాగా దీనిపై మరోసారి స్పందించాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గంభీర్. హిట్‌మ్యాన్ విషయంలో సెలక్షన్ కమిటీ, ఫిజియో, కోచ్ రవిశాస్త్రి మధ్య సమన్వయం ఉంటే గందరగోళ పరిస్థితి ఉండేది కాదన్నాడు.
"రోహిత్ గాయం గురించి సెలక్షన్ కమిటీ ఛైర్మన్ సునిల్ జోషి, ఫిజియో, కోచ్ రవిశాస్త్రి మధ్య సమన్వయం ఉంటే గందరగోళ పరిస్థితి ఎదురవ్వదని గంభీర్ అభిప్రాయపడ్డాడు. అతడి గురించి ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుని సమగ్రంగా విశ్లేషించుకుంటే సరిపోతుంది. పరిస్థితులన్ని సాఫీగా సాగుతాయి. అంతేగాక కోచ్ రవిశాస్త్రి ద్వారా కోహ్లీ ఎప్పటికప్పుడు రోహిత్ గాయం గురించి తెలుసుకోవాలి."
-గంభీర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్.
భారత్‌తో జరిగిన తొలి రెండు వన్డేల్లో శతకాలు సాధించిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌ను గౌతం గంభీర్ కొనియాడాడు. "టీమ్ఇండియాపై ఎలా సత్తాచాటాలో స్మిత్ తెలుసుకున్నాడు. కానీ అతడిని కట్టడిచేసే విధానాన్ని భారత జట్టు కనుగొనలేదు. కాగా, అతడు 18 ఓవర్లలోనే శతకాన్ని సాధించాడు. 20వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 38 ఓవర్‌లోనే సెంచరీ అందుకున్నాడు. అది కూడా వరుసగా రెండు శతకాలు చేయడం సాధారణ విషయం కాదు. అతడు కోహ్లీకి దూరంగా లేడు. వన్డేల్లో ప్రపంచ నంబర్ వన్‌గా విరాట్ గురించి చెబుతుంటాం. అయితే అతడికి స్మిత్ చాలా దగ్గరగా ఉన్నాడు. కోహ్లీ ఉత్తమ గణాంకాలు కలిగి ఉన్నాడు. కానీ గత రెండు మ్యాచ్‌ల్లో స్మిత్ ప్రదర్శన గొప్పగా ఉంది" అని గంభీర్ చెప్పాడు.
స్మిత్‌ను బోల్తా కొట్టించడానికి ప్రణాళికలు సిద్ధం చేయకపోతే ఈ పర్యటన భారత బౌలర్లకు అత్యంత కఠినంగా సాగుతుందని గంభీర్ అన్నాడు. ఇదే ఫామ్ అతడు టెస్టుల్లో కూడా కొనసాగిస్తే టీమ్ఇండియాకు సవాలుగా ఉంటుందని పేర్కొన్నాడు. కాగా, మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. కాన్‌బెర్రా వేదికగా చివరి వన్డే బుధవారం జరగనుంది.
ఇదీ చూడండి : 'కోహ్లీ కెప్టెన్సీ అసలు అర్థమే కావట్లేదు'