టీమ్‌ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఓసారి తన పాటతో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్‌ను తికమక పెట్టాడు. ఈ విషయాన్ని సహచర ఆటగాడు రోహిత్ శర్మ చెప్పాడు. తాజాగా వీరిద్దరూ మయాంక్ అగర్వాల్‌తో వీడియో చాట్ చేయగా.. రోహిత్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన చిన్నపాటి ప్రోమోను ట్విట్టర్లో ఉంచింది బీసీసీఐ.
ఈ వీడియోలో మయాంక్ అగర్వాల్.. తొలుత ధావన్‌ను ఓ పంజాబీ పాట పాడమని అడిగాడు. తాను ఆ పాటలు బాగా పాడలేనని.. సారథి విరాట్ కోహ్లీ తనకన్నా అద్భుతంగా పాడతాడని చెప్పాడు. అనంతరం రోహిత్‌తో తరచూ పాడే ఓ పంజాబీ పాటని అందుకున్నాడు. ధావన్ ఆ పాటను పూర్తి చేసిన వెంటనే రోహిత్ మాట్లాడుతూ.. 2015 బంగ్లాదేశ్ పర్యటనను గుర్తుచేసుకున్నాడు.
"2015లో బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా ఓ మ్యాచ్ ఆడుతున్నాం. అప్పుడు నేను తొలి స్లిప్‌లో ఉండగా, ధావన్ మూడో స్లిప్‌లో నిల్చున్నాడు. ఉన్నట్టుండి అతడు గట్టిగా పాట పాడటం మొదలెట్టాడు. అప్పుడు తమీమ్ ఇక్బాల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ పాట విని అతడు అవాక్కయ్యాడు. ఎక్కడి నుంచి పాట వస్తుందనే విషయం అతడికి అర్థంకాలేదు. దాంతో మేం ఒకటే నవ్వుకున్నాం. అదిప్పుడు అంత హాస్యాస్పదంగా ఉండదు కానీ.. ఆ రోజు మైదానంలో మాత్రం నవ్వు ఆపుకోలేకపోయాం. అది చాలా సరదాగా అనిపించింది" అని రోహిత్ వివరించాడు.
శిఖర్ ధావన్, రోహిత్‌శర్మ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచీ భారత జట్టుకు మంచి ఆరంభాలు ఇస్తున్నారు. వీరిమధ్య చక్కటి సమన్వయం, అనుబంధం నెలకొంది.
ఇదీ చూడండి : 'దురదృష్టవంతుల జాబితాలో నేనూ ఒకడిని'