భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు 2019 ఏడాది పెద్దగా కలిసిరాలేదు. అనుభవజ్ఞుల మద్దతు ఉన్నప్పటికీ.. గతేడాది భారత ప్రపంచకప్ జట్టులో ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే ధోనీ జట్టుకు దూరమైన కారణంగా.. రిషభ్‌కు సత్తా నిరూపించుకునే సువర్ణవకాశం లభించింది. అయితే కీపర్‌గా ధోనీ స్థానంలో వచ్చిన పంత్.. 2020 ప్రారంభంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ ఆ స్థానంలో మంచి గుర్తింపు తెచ్చుకోగా.. పంత్‌కు ప్రాధాన్యం తగ్గిపోయింది.
అయితే, పంత్‌కు ఇంకా మేనేజ్మెంట్ మద్దతు ఉందని టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ తెలిపాడు. పరుగులు సాధించడంలో పంత్ జట్టుకు ఎంతగానో కృషి చేస్తాడని వెల్లడించాడు. ధోనీ స్థానంలోని ఒత్తిడిని అర్థం చేసుకున్న అతడు బలమైన, మంచి ఆటగాడిగా మారతాడని అభిప్రాయపడ్డాడు. ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రాథోడ్ .. తన అభిప్రాయాలు పంచుకున్నాడు.