ప్రపంచకప్లో రాయుడుకు స్థానం లభించపోవడంపై భారత మాజీ క్రికెటర్ గంభీర్ స్పందించాడు. రాయుడుకు చోటు కల్పించకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కేవలం మూడు మ్యాచ్ల్లో విఫలమవడం వల్ల ఎంపిక చేయలేకపోవడం దురదృష్టమని వ్యాఖ్యానించాడు.
"ప్రస్తుతం పంత్ స్థానం గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ రాయుడును తప్పించడమే అతి పెద్ద చర్చ. చోటు లభించకపోతే బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. వన్డేల్లో 48 సగటు ఉండి కూడా ఎంపిక కాకపోవడం దురదృష్టకరం".
గంభీర్, భారత ఆటగాడు
భారత జట్టులో నాలుగో స్థానానికి రాయుడు సరిగ్గా సరిపోతాడని కొన్ని నెలల క్రితం కోహ్లీ చెప్పిన విషయం తెలిసిందే. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో ఫామ్ కోల్పోవడం వల్ల సెలెక్టర్లు పునరాలోచనలో పడ్డారు.
2007 ప్రపంచకప్లో తనకు స్థానం లభించలేదని.. అందుకే ఆ పరిస్థితుల్లో మనోవేదన ఎలా ఉంటుందో తెలుసని రాయుడికి సానుభూతి తెలిపాడు గంభీర్. ప్రపంచకప్ ఆడాలని ప్రతి ఆటగాడు కోరుకుంటాడని.. రాయుడుకు చోటు లభించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించాడు.