రానున్న ఐపీఎల్ కోసం కొత్త జెర్సీని ఆవిష్కరించింది రాజస్థాన్ రాయల్స్. అది కూడా వినూత్న పద్ధతిలో.. రాజస్థాన్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రారంభించింది. ముంబయిలోని బయో బబుల్లో ఉన్న తమ ఆటగాళ్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ అభిమానుల కోసం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.
రెడ్ బుల్ ఇండియా భాగస్వామ్యంతో ఈ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసింది రాజస్థాన్ ఫ్రాంఛైజీ. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెరపై 3డీ వీడియోను ప్రత్యక్ష ప్రసారం చేసింది. ముందుగా స్టేడియం లైట్ షోతో ప్రారంభమైన వీడియో.. తర్వాత స్టాండ్స్ వరకు సాగింది. అనంతరం జైపుర్ నగరంతో పాటు రాజస్థానీ సంస్కృతి, రెడ్బుల్తో ఫ్రాంఛైజీకి ఉన్న అనుబంధాన్ని ఇందులో చూపించింది.