మైదానంలో పరుగుల వరద పారిస్తున్న సమిత్ ద్రవిడ్.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌కు పుత్రోత్సాహం కలిగిస్తున్నాడు. ఇప్పుడు రెండు నెలల వ్యవధిలోనే రెండో డబుల్ సెంచరీ చేసి అదరగొట్టాడు.
మాల్యా అదితి అంతర్జాతీయ పాఠశాల తరఫున అండర్-14 బీటీఆర్ షీల్డ్ మ్యాచ్‌లో శ్రీ కుమారన్ జట్టుపై అద్వితీయ ద్విశతకం సాధించాడు. 33 బౌండరీలు బాది 204 పరుగులు చేశాడు. తన జట్టును 377/3తో నిలిపాడు. ఛేదనలోనూ బంతితో రాణించాడు. రెండు వికెట్లు తీశాడు. ఇతర బౌలర్లు రాణించడం వల్ల ప్రత్యర్థి జట్టు 110 పరుగులకే కుప్పకూలింది. సమిత్ జట్టు 267 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది.