నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది టీమ్ఇండియా. కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నా.. మిగతా బ్యాట్స్‌మెన్, బౌలర్లు విఫలమవడం వల్ల ఓటమి తప్పలేదు. అయితే ఈ మ్యాచ్‌తో పాటు మొదటి రెండు టీ20ల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు ఓపెనర్ కేఎల్ రాహుల్. ఇందులో రెండు డకౌట్లు ఉన్నాయి. కాగా, ఈ మ్యాచ్ అనంతరం రాహుల్ బ్యాటింగ్‌పై స్పందించిన కోహ్లీ.. అతడిని వెనకేసుకొచ్చాడు.
"రాహుల్ ఓ ఛాంపియన్ ప్లేయర్. రోహిత్‌తో పాటు టాపార్డర్‌లో జట్టు ప్రధాన ఆటగాడిగా అతడు కొనసాగుతాడు. ఈ ఫార్మాట్లో ఐదారు బంతులాడితే ఫామ్ అందుకోవచ్చు" అని తెలిపాడు కోహ్లీ.
అలాగే తన ప్రదర్శనపై మాట్లాడిన విరాట్.. "జట్టుకు ఉపయోగపడని ప్రదర్శన చేయాలని ఎవరూ అనుకోరు. కొత్త బంతితో బ్యాటింగ్ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది. ఇంగ్లాండ్ బౌలర్లు పిచ్‌ను ఉపయోగించుకుని బంతుల్ని వేశారు. నేను సుదీర్ఘంగా బ్యాటింగ్ చేయడం అవసరమనిపించింది. అందువల్లే చివరికి మెరుగైన స్కోర్ సాధించాం" అంటూ వెల్లడించాడు.
ఈ మ్యాచ్‌లో 46 బంతుల్లో 77 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు కోహ్లీ. ఫలితంగా భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేయగలిగింది. కానీ బట్లర్ అర్ధ సెంచరీతో రెచ్చిపోవడం వల్ల ఇంగ్లాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌లో 2-1తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టీ20 గురువారం జరగనుంది.