వేసవిలో ఐపీఎల్ వస్తుంది. కానీ అంతకంటే ముందే వేడెక్కించే సిరీస్‌కు వేళైంది. ఉర్రూతలూగించే ధనాధన్ ఆటకు రంగం సిద్ధమైంది. ఇంగ్లాండ్‌తో భారత్ అయిదు టీ20ల సిరీస్ షురూ అయ్యేది శుక్రవారమే! టెస్టు సిరీస్ గెలిచి హుషారుగా ఉన్న టీమ్‌ఇండియా.. అక్టోబర్‌లో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా భావిస్తున్న ఈ సమరంలో ఇంగ్లిష్ జట్టును ఓడించి సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. కానీ మోర్గాన్ బృందం కూడా అంతే బలంగా ఉన్న నేపథ్యంలో ఈ పోరు హోరాహోరీగా సాగడం ఖాయం.
అదిరే ఫామ్.. బలమైన రిజర్వ్ బెంచ్.. సొంతగడ్డ.. ఇన్ని అనుకూలతల మధ్య నంబర్‌వన్ జట్టు ఇంగ్లాండ్‌తో అయిదు టీ20ల సమరానికి భారత్ సై అంటోంది. శుక్రవారం తొలి టీ20 మ్యాచ్ గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని కోహ్లీసేన ఉవ్విళ్లూరుతోంది. పొట్టి కప్పు ముందు జరగనున్న ఆఖరి అంతర్జాతీయ టీ20 సిరీస్ ఇది. మేళవింపును తుదిగా ఖరారు చేసుకోవాలనుకుంటున్న భారత్‌కు ఈ సిరీస్ ఎంతో కీలకం.
రాహులే ఓపెనర్
ఈ సిరీస్‌లో రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మకు జతగా ఎవరు బరిలో దిగుతారా అన్న ప్రశ్నకు సమాధానం లభించింది. రోహిత్‌కు తోడుగా కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడని కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా రోహిత్-రాహుల్ జోడీ అదిరే ఆరంభాలను ఇచ్చిందని.. ఇదే జంటను ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో కొనసాగిస్తున్నట్లు.. శిఖర్ ధావన్ రిజర్వ్‌గా ఉంటాడని పేర్కొన్నాడు. ఒకవేళ రోహిత్-రాహుల్ ఇద్దరిలో ఎవరికైనా గాయాలు అయితే అప్పుడు శిఖర్ ఓపెనింగ్‌కు వస్తాడని విరాట్ చెప్పాడు. నాలుగో స్థానం కోసం శ్రేయస్, సూర్యకుమార్ పోటీపడుతున్నారు. పంత్, హార్దిక్ తుది జట్టులో ఆడడం ఖాయం కాబట్టి మిడిలార్డర్‌లో వీరిద్దరిలో ఒకరికే ఛాన్స్ లభిస్తుంది. అనుభవం ఉన్న శ్రేయస్‌కే ఆ అవకాశం దక్కొచ్చు.
భువీదే ఆ భారం:
ఆస్ట్రేలియా పర్యటనలో ఆకట్టుకున్న నటరాజన్ గాయం కారణంగా సిరీస్ ఆడే అవకాశం కనిపించడం లేదు. ఇప్పుడు బౌలింగ్ విభాగాన్ని నడిపించే బాధ్యత అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్‌దే. చివరిగా 2019 డిసెంబర్‌లో టీమ్‌ఇండియాకు ఆడిన భువి.. ఎలా బౌలింగ్ చేస్తాడనేది ఆసక్తికరం. రెండో పేసర్ స్థానం కోసం శార్దూల్, దీపక్ చాహర్, సైని మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. బ్యాటింగ్‌ను దృష్టిలో పెట్టుకుంటే శార్దూల్‌కు జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి. స్పిన్ విభాగంలో చాహల్‌కు జతగా వాషింగ్టన్ సుందర్ లేదా అక్షర్ పటేల్‌కు ఛాన్స్ దక్కొచ్చు. పిచ్ స్లో బౌలర్లకు అనుకూలించే నేపథ్యంలో ఈ ముగ్గురూ తుది జట్టులో ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
"ప్రపంచకప్ ముంగిట మేం ఆడేది ఈ అయిదు టీ20లే. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో భారత కుర్రాళ్లు ఎలా రాణిస్తారో చూడాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జట్టు సమతూకంగా ఉంది. కొత్తగా వచ్చిన ఆటగాళ్ల వల్ల బ్యాటింగ్ లోతు పెరిగింది. గతంలో ఆడినట్లుగా కాకుండా మా బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించబోతున్నారు. ఆరంభంలో ఒకటి, రెండు వికెట్లు పడినా దూకుడు కొనసాగించాలని ఆశిస్తున్నా. ఏ దశలోనైనా ఆట స్వరూపాన్ని మార్చే ఆటగాళ్లు జట్టులో చాలామంది ఉండడం కలిసొచ్చే అంశం. ప్రపంచకప్ ముంగిట ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుతో ఆడాలనే ఎవరైనా కోరుకుంటారు."
-విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్.