గాడి తప్పిన ఫామ్.. అంచనాలను అందుకోలేక వైఫల్యం.. వెరసి టీమ్‌ఇండియాలో స్థానం ప్రశ్నార్థకం. ఇదీ ఐపీఎల్-13కు ముందు కొంతమంది భారత క్రికెటర్ల పరిస్థితి. మళ్లీ జాతీయ జట్టులోకి వస్తామా? అసలు అవకాశం దక్కుతుందా? అనే భయాలు ఓ వైపు.. ఐపీఎల్‌లో సత్తాచాటి తిరిగి టీమ్‌ఇండియా జెర్సీ ధరిద్దామనే ఆశ మరో వైపు.. ఇలా ఆ సీజన్‌లో బరిలో దిగిన ఆ ఆటగాళ్లు గొప్పగా రాణించారు. తమ ప్రదర్శనతో సెలక్టర్లను మెప్పించి ఆస్ట్రేలియా విమానమెక్కారు. కంగారూ గడ్డపై వీళ్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారో తెలియాలంటే కొద్దికాలం ఆగాల్సిందే! మరి ఆ ఆటగాళ్లు ఎవరో చూసేద్దాం.
ధనాధన్ మళ్లీ..
రోహిత్ శర్మతో కలిసి పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమ్‌ఇండియా విజయాల్లో కీలకంగా మారిన ఓపెనర్ శిఖర్ ధావన్‌కు ఐపీఎల్‌కు ముందు నిలకడ లేమి సమస్యగా మారింది. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో గాయం కారణంగా మొత్తం టోర్నీ నుంచే తప్పుకున్న అతను.. తిరిగి వెస్టిండీస్ సిరీస్‌తో జట్టులోకి వచ్చినప్పటికీ రాణించలేకపోయాడు. ఓ వైపు గాయాలు.. మరోవైపు అతని స్థానంలో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ పాతుకుపోవడం వల్ల ధావన్‌కు జట్టులో చోటే ప్రశ్నార్థకమైంది. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన అతను మునుపటిలా చెలరేగి.. వరుసగా రెండు శతకాలు చేసి లీగ్ చర్రితలో ఆ ఘనత అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా దిల్లీ క్యాపిటల్స్ తరపున 17 మ్యాచ్‌ల్లో 618 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శనతో ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికైన అతను.. కంగారూ గడ్డపై ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.
కొత్త కోణం చూపించి..
గత ఆస్ట్రేలియా సిరీస్ (2018-19)లో ఓపెనర్ పృథ్వీ షా గాయంతో దూరమవడం వల్ల టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న మయాంక్ అగర్వాల్.. ఆ తర్వాత నిలకడగా రాణిస్తూ సుదీర్ఘ ఫార్మాట్లో ఓపెనర్‌గా స్థిరపడ్డాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం అతనికి ఎక్కువ అవకాశాలు దక్కలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో రెండు వన్డేలు ఆడినప్పటికీ ప్రభావం చూపలేకపోయాడు. దీంతో అతను పుజారా లాగా కేవలం టెస్టులకే పరిమితమవుతాడా? అనే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ ఐపీఎల్-13 తర్వాత అతని ఆటపై ఉన్న అభిప్రాయాలు మారిపోయాయి. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే దిల్లీపై 60 బంతుల్లోనే 89 పరుగులు చేసి తనలోని విధ్వంసక కోణాన్ని బయటపెట్టాడు. అదే దూకుడు కొనసాగించిన అతను.. మధ్యలో గాయంతో అందుబాటులో లేనప్పటికీ.. మొత్తంగా 11 మ్యాచ్‌ల్లో 424 పరుగులతో సీజన్‌ను ముగించాడు. పంజాబ్ తరపున ఈ ధనాధన్ బ్యాటింగ్‌తోనే ఆస్ట్రేలియా పర్యటనకు అన్ని జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు. అతను ఇదే జోరు కొనసాగిస్తే మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా ఎదిగే అవకాశముంది.