సౌరాష్ట్రతో జరుగుతోన్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో పిచ్ మరీ దారుణంగా ఉందని బంగాల్ టీమ్ కోచ్ అరుణ్ లాల్ అభిప్రాయపడ్డాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర ఐదు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. అరుణ్ బరోట్(54), విశ్వరాజ్ జడేజా(54) అర్ధ శతకాలతో ఆదుకున్నారు. మ్యాచ్ అనంతరం బంగాల్ కోచ్ మాట్లాడుతూ పిచ్ సరిగ్గా లేదన్నాడు.
"ఈ పిచ్ మరీ దారుణంగా ఉంది. బీసీసీఐ ఇలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. బంతి అస్సలు పైకి రావట్లేదు. దుమ్ము లేవడం వల్ల బంతి కింద నుంచి వెళ్తోంది"
అరుణ్ లాల్, బంగాల్ జట్టు కోచ్
"ఫైనల్ మ్యాచ్‌ను తటస్థ వేదికపై నిర్వహించాలా" అని మీడియా అడిగిన ప్రశ్నకు.. అలా అవసరం లేదని, ఇక్కడ న్యూట్రల్ క్యూరేటర్లే ఉన్నారని చెప్పాడు. బీసీసీఐ ఇలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరాడు. "ఈ విషయంపై బోర్డు అధ్యక్షుడు సౌరభ్ గంగూలీతో మాట్లాడతారా" అని అడగ్గా.. అది తన పని కాదని, స్వయంగా వాళ్లే చూసుకోవాల్సిందని చెప్పాడు. మీడియం పేసర్ బంతులేస్తున్నా బంతి స్లిప్ వరకు కూడా వెళ్లట్లేదన్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంకా చాలా సమయం ఉన్నందున తమ జట్టు చివరి వరకు పోరాడుతుందని స్పష్టం చేశాడు. ఫలితం ఏదైనా తాము పట్టించుకోమని, అత్యుత్తమ ప్రదర్శన చేయడానికే ప్రయత్నిస్తామని తెలిపాడు. సౌరాష్ట్రను 300లోపు కట్టడిచేస్తే బాగుంటుందని అరుణ్‌లాల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.