అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైంది టీమ్ఇండియా. రెండో ఇన్నింగ్స్లో కేవలం 36 పరుగులకే ఆలౌటైన కోహ్లీసేనపై విమర్శలు కూడా వస్తున్నాయి. మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన సారథి కోహ్లీ.. మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉండేదని ఆశాభావం వ్యక్తం చేశాడు.
"ఈ ఓటమి వల్ల కలిగిన బాధను మాటల్లో వర్ణించలేను. 60 పరుగుల ఆధిక్యంలో ఉండి మూడో రోజు దారుణంగా విఫలమయ్యాం. రెండు రోజులు కష్టపడి మ్యాచులో ఆధిక్యంలో ఉండి 'గెలుపు చాలా కష్టం' అనే స్థితికి చేరుకున్నాం. ఈ రోజు మా బ్యాటింగ్లో తీవ్రత దెబ్బతింది. మరింత జాగ్రత్తగా ఆడాల్సింది. ఆసీస్ బౌలర్లు తొలి ఇన్నింగ్స్ మాదిరిగానే బంతులు వేశారు. కానీ మేమే పరుగులు సాధించడంపై దృష్టి పెట్టాం. ఆ మైండ్ సెట్ వల్లే ఇలా జరిగింది. మా ఆటగాళ్లు పరుగులు చేయడంలో కష్టపడటం వల్ల ప్రత్యర్థి బౌలర్లలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. తప్పకుండా రెండో టెస్టులో టీమ్ఇండియా పుంజుకుని ప్రత్యర్థి జట్టుపై ప్రతీకారం తీర్చుకుంటుంది."