కరోనా సంక్షోభ ప్రభావం తమపై తీవ్రంగా పడిందని క్రికెట్ వెస్టిండీస్ అధ్యక్షుడు రికీ స్కెరిట్ చెప్పారు. అప్పులు చేసి మరీ క్రికెటర్లు, సిబ్బందికి జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. అయితే తన హయాంలో బోర్డు ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని, అప్పులు మూడొంతులు తగ్గాయని పేర్కొన్నారు.
రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న స్కెరిట్, మరోసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. గయానా క్రికెట్ బోర్డు సెక్రెటరీ ఆనంద్ సనాసీతో ఆయన పోటీ పడనున్నారు.
ప్రస్తుతం వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు సంస్థాగతంగా 20 మిలియన్ల డాలర్ల వరకు అప్పులున్నాయని స్కెరిట్ వివరించారు. అయితే త్వరలోనే ఈ ఆర్థిక సమస్యలను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభం కారణంగా క్రికెటర్లు, సిబ్బంది జీతాల్లో 50 శాతం కోత విధించినట్లు వెల్లడించారు. లాభ నష్టాలపై కాకుండా అనవసర ఖర్చును తగ్గించడంపై దృష్టి సారించినట్లు చెప్పారు.
కరోనా సంక్షోభ సమయంలో విదేశీ పర్యటనకు వెళ్లిన తొలి జట్టు వెస్టిండీస్ కావడం గమనార్హం. గతేడాది జులైలో ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ఆడింది.
ఇదీ చూడండి:మూడో వన్డేలో భారత్ విజయం.. కోహ్లీ సేనదే సిరీస్